Friday, February 5, 2016

జన్మభూమి అరాచకాలపై హైకోర్టు మండిపాటు

* బతికి ఉన్న మనిషిని చనిపోయినట్లుగా ధ్రువీకరిస్తారా
* ఇవేం అరాచకాలు.. అసలు క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోంది
* మీరు అధికారంలో ఉండచ్చు. తర్వాత మరొకరు అధికారంలోకి రావచ్చు
హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న జన్మభూమి కమిటీల అరాచకాల్ని గౌరవ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఏ అధికారం లేకపోయినప్పటికీ, జన్మభూమి కమిటీలు చెప్పాయన్న కారణంతో అర్హులైన లబ్దిదారులకు అందాల్సిన ప్రజా సంక్షేమ పథకాల్ని రద్దు చేస్తుండటంపై హైకోర్టు మండిపడింది. ఈ కమిటీల నిర్వాకంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
     

శ్రీకాకుళం జిల్లా కు చెందిన అమ్మణ్ణమ్మ అనే ముదుసలి మహిళకు పెన్షన్ ఒక్కటే జీవనాధారం. ఆమె చనిపోయిందని జన్మభూమి కమిటీ చెప్పటంతో పెన్షన్ రద్దు చేశారు. అలాగే మెట్ట లక్ష్మి అనే వితంతువు కి తర్వాత కాలంలో ఆమె వితంతు కోటాలోకి రాదంటూ రద్దు చేశారు. ఇటువంటి ఘోరాల మీద దాదాపు 75 మంది హైకోర్టుని ఆశ్రయించారు. వీటిని పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం తీరుని తప్ప పట్టారు.వేటి ఆధారంగా ఈ నిర్ణయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ కారణాలతో పెన్షన్లు రద్దు చేస్తున్నారన్న పిటీషనర్ల వాదనల్ని కోర్టు పరిగణనలోకి తీసుకొంది. అప్పీల్ తీసుకొనేందుకు కూడా స్థానిక ఎంపీడీవో తిరస్కరించారని, అధికార పార్టీ నాయకులు చెబితేనే అభ్యర్థన తీసుకొంటామని చెప్పారని న్యాయవాదులు కోర్టుకు తెలియచేశారు.
        దీని మీద న్యాయస్థానం తీవ్రంగ స్పందించింది. “ ముదుసలి మహిళను చూస్తే ఆమె పెన్షన్ కు అర్హురాలని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అధికారులకు మాత్రం ఇవేమీ కనిపించటం లేదు. భౌతికంగా చూసి కూడా కాదంటున్నారు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా అంగవైకల్యం లేదంటున్నారు. పెన్షన్ లేదంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటివి వాంఛనీయం కాదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. కోర్టు దగ్గరకు వచ్చిన వారు సముద్రంలో నీటిచుక్క మాత్రమే. ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఇలా చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నవారు రేపు అధికారంలోకి వస్తే వారూ మిమ్మల్ని చూసి ఇలానే చేయవచ్చు. అంతిమంగా ఇబ్బంది పడేది మాత్రం అమాయకపు ప్రజలే” అని న్యాయమూర్తి అభిప్రాయ పడ్డారు.
        ఈ అంశం మీద ఉప లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకొన్న చర్యల్ని వివరించాలన్నారు. దీని మీద విచారణ ను ఈ నెల 16 కు వాయిదా వేశారు. 

No comments:

Post a Comment