Tuesday, February 2, 2016

ఓటరా.. కదలిరా...

ప్రజాస్వామ్యం మనకిచ్చిన అతిపెద్ద అవకాశం ఓటు హక్కు. విద్యాధికులు ఎక్కువున్న మహానగరాల్లో ఆ హక్కు అలక్ష్యానికి గురవు తోంది. చట్టసభల్లో సరే! స్థానిక సంస్థల ఎన్నికల సమ యంలోనూ అదే పరిస్థితి! ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా, పూణె, అహ్మదాబాద్‌ వంటి మహానగరాల కన్నా హైదరాబాద్‌లో 2009 జరిగిన గ్రేటర్‌ ఎన్నికల ప్రకారం పోలైన ఓట్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. అలా అని ఆ నగరాల్లో ఎదో పరిస్థితి మెరుగని కాదు. గత గ్రేటర్‌ ఎన్ని కల్లో పేద, మధ్య తరగతివాసులు నివసించే పత్తర్‌గట్టీలో 65శాతం ఓట్లు నమోదైతే, చదువుకున్నవారు ఎక్కువగా ఉన్న విజయనగర్‌కాలనీ వార్డులో కేవలం 25శాతం ఓట్లు పోలవడం ఎలాంటి సంకేతాలు అందిస్తున్నాయనేది పెద్ద ప్రశ్నే. మిగతానగరాల్లో కూడా చదువుకున్నవారి కంటే బస్తీలు, వాడల్లో నివసించేవారు, గ్రామీణ ప్రాంతాల నుంచి వలసవచ్చినవారే నగరాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని సామాజిక విశ్లేషకులు అంటున్నారు.


అలక్ష్యానికి కారణాలివే... 
నగరవాసులు ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవట్లేదు అంటే, వారికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదనేది కొంత మంది ప్రచారం చేస్తున్న వాదన. కానీ అది ఏ మాత్రం వాస్తవం కాదు. సరైన పాలకులు...వారు మెచ్చిన నాయకులు లేరనే నిస్పృహే వారిని పోలింగ్‌ బూతువైపుకు రాకుండా చేస్తుందని చెబుతున్నారు సివిక్‌ సొసైటీ సభ్యులు డా. రావు చెలికాని. పోలింగ్‌ రోజంటే సెలవురోజని సంతోషపడుతున్నారేకానీ, దాని మాటున మన జీవితాలను 5ఏళ్లపాటు వారి చేతిలో పెడుతున్నామని గుర్తించాల్సిన అవసరముందంటున్నారు సామాజిక వేత్తలు. తమ ఓటు హక్కును వినియోగించుకోక పోతే అవినీతినాయకులను మనమే ప్రోత్సహించినట్టు లెక్క అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొ లక్ష్మి. ఏ పార్టీ నాయకుడు నచ్చకపోతే, మరో అవకాశం మనకు కల్పించింది రాజ్యాంగం. అదే నోటా! అంతే కానీ అసలు ఓటు హక్కును అలక్ష్యం చేయడం మాత్రం బాధ్యతగల పౌరులు చేసే పనికాదు.

ప్రశ్నించేందుకు ఒక పేటెంట్‌ 
ఎన్నుకున్న నాయకుడు మీ ఆశలు అడియాసలు చేశారు. స్థానిక సమస్యలు గాలికొదిలేశారు. అవినీతే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. మనకు తెలి యకుండానే మనల్ని మింగేస్తున్నారు. భరించడమేనా... సహించడమేనా! కాదుగా! నిజాయితీగా నీవేసిన ఓటు నీ బాధ్యతను గుర్తుచేస్తుంది. సహనమనే నల్లమబ్బులను చీల్చేస్తుంది. పిడికిలి బిగించేందుకు శక్తినిస్తుంది. ప్రశ్నించే గొంతుకవుతుంది. సమస్యలపై సమరభేరికి శంఖారావం పూరిస్తుంది. అదే ప్రలోభాలకు గురై, కానుకలకు ఆశ పడి ఓటేస్తే ఆత్మాభి మానాన్ని తాకట్టుపెట్టుకున్నట్టే! అసలు ఓటే వేయకపోతే! ఆత్మాభిమానాన్ని పాతాళానికి తోసినట్టే! అందుకు ఓటు ఓ ఆయుధం. దాన్ని సంధించేందుకు ఓటు హక్కున్న ప్రతి నగరవాసి ఇల్లువదిలి పోలింగ్‌ బూతు బాట పట్టాల్సిందే!
సిరా చుక్కతో గర్వంగా ఆకాశానికేసి చూడాల్సిందే!
చార్మినార్‌ సాక్షిగా...మహా నగరం కోసం.వీధి చివర చెత్తకుండీ కంపుకొడుతోంది... ముక్కుమూసుకొని పక్కకు పోవడమేనా సమాధానం!
సర్కారు నల్లా సతాయిస్తుంది... ఇంకెంత కాలం భరించడం!
రోడ్డుపైన గుంతలు రక్తం కళ్ల చూస్తుంటే... ఆ సహనమేల!
వీధుల్లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ పై ఛీత్కారమే పరిష్కారమా!
ఒకటేమిటి...అడుగుకొక సమస్య... అడుగడుగుకో గండం... నగర జీవన పోరాటంలో...
వాటన్నింటినీ ఎదుర్కునే పాశుపతం ఇప్పుడు ఉంది నగరవాసి చేతిలో...
సంధించే సమయమిదే ఓటు అనే ఆయుధంతో...
ప్రజాస్వామ్యమిచ్చిన విలువైన కానుకతోనే...
ప్రశ్నించే హక్కును పేటెంట్‌గా పొందాల్సిందే...
పాలకులను నిగ్గదీసి అడగాల్సిందే... అంతకుముందు... ఓటు హక్కును సద్వినియోగించుకోవాలి

No comments:

Post a Comment