Wednesday, February 3, 2016

గ్రేటర్‌ సమరం ముగిసింది....

హైదరాబాద్‌ : గ్రేటర్‌ సమరం ముగిసింది. 25 రోజుల క్రితం మొదలైన ఎన్నికల సంద డికి పోలింగ్‌తో తెరపడింది. సూత్రప్రాయంగా 45 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారి జనార్దనరెడ్డి తెలిపారు. బుధవారం తుది లెక్కలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సాయంత్రం 4.30 వరకు నమోదైన వివరాల ప్రకారం 37.70 శాతం పోలింగ్‌ నమోదైందని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో పేర్కొంది. పోరు ముగిసిన నేపథ్యంలో ఇక తేలాల్సింది అభ్యర్థుల భవితవ్యం. ఈనెల 5న జరిగే లెక్కింపుతో విజేతలెవరు..? పరాజితులెవరు..? అన్నది తేలిపోనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు 24 కేంద్రాల్లో గ్రేటర్‌లోని 150 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్‌ కోసం 893 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 3,200 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. అరగంటలోపే మొదటి ఫలితం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు జనవరి 8న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 12 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ 17తో ముగిసింది. 18న స్ర్కూటినీ.. 19, 20, 21తేదీల్లో ఉపసంహరణకు అవకాశం కల్పించారు. 21న సాయంత్రం గ్రేటర్‌ బరిలో నిలిచిన 1,333 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 22 నుంచి గ్రేటర్‌లో ప్రారంభమైన ప్రచార హోరు 31తో ముగిసింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ పలు ప్రాంతాల్లో 5.45 వరకు కొనసాగింది. పాతబస్తీలో కాంగ్రెస్‌ అగ్రనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీలపై దాడి, డిప్యూటీ సీఎం కొడుకు అజంఅలీపై దాడి మినహ పెద్దగా ఘర్షణలు చోటు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో తమ ఓట్లు తొలగించారని పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్‌ స్లిప్పులు ఇవ్వకపోవడంతో పలు డివిజన్లలో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియక..? పోలింగ్‌ కేంద్రాల్లో చెప్పేవారు లేక వెనుదిరగడం కనిపించింది. గ్రేటర్‌ బరిలో మొత్తం 1,333 మంది బరిలో నిలిచారు. వీరిలో కేవలం 150 మంది విజేతలుగా నిలువనున్నారు. చాలా ప్రాంతాల్లో పోరు హోరాహోరిగా సాగింది. నువ్వా..? నేనా...? అన్నట్టు అభ్యర్థులు తలపడ్డారు. కొన్ని డివిజన్లలో వ్యక్తులను చూసి ఓటు వేయగా.. మెజార్టీ ప్రాంతాల్లో పార్టీపై అభిమానమే ఎక్కువగా ఓటింగ్‌కు కారణమైంది. 74,23,980 మంది ఓటర్లకు గాను 27,99,078 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి.
శివార్లలో అధికం...
గ్రేటర్‌ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లో అధిక పోలింగ్‌ నమోదైంది. కోర్‌ ఏరియాలో సగటు అటు, ఇటుగా 30-35 శాతం మధ్యలో ఉండగా... శివార్లలో మాత్రం 40-45 శాతంగా నమోదైంది. ఈస్ట్‌జోన్‌లోని కాప్రా సర్కిల్‌లో అత్యధికంగా 48.46శాతం, ఉప్పల్‌లో-46, ఎల్‌బీనగర్‌ (3ఏ)లో- 44.74, ఎల్‌బీనగర్‌ (3బీ)లో 39.81శాతం ఉంది. రామచంద్రాపురం సర్కిల్‌ పరిధిలో మూడు డివిజన్లుండగా అత్యధికంగా 55, కూకట్‌పల్లి(ఏ)లో 49.28, కూకట్‌పల్లి(బీ)లో 46.83 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలోని రెండు సర్కిళ్ల పరిధిలో వరుసగా 44.33, 38.72 శాతం పోలింగ్‌ నమోదైంది. కోర్‌ ఏరియాతో పోలిస్తే ఈసారి శివార్లలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో రాజకీయ సమీకరణాలపై ఆసక్తి నెలకొంది. గత లెక్కలను పరిశీలిస్తే ఆయా ప్రాంతాల్లో టీడీపీకి గట్టి పట్టున్నట్టు స్పష్టమవుతుంది. విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో పరిస్థితుల్లో చాలా వరకు మార్పులొచ్చాయి. అధికార టీఆర్‌ఎస్‌ పట్టు పెంచుకున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో శివారు ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న దానిపైనే మేయర్‌ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఆధారపడి ఉంటుంది.
సౌత్ లో లెస్‌... కోర్‌లో మరీ తక్కువ...
సార్వత్రిక.. స్థానిక సంస్థ.. ఏ ఎన్నికలైనా అత్యధిక పోలింగ్‌ నమోదయ్యే సౌతజోన్‌లో ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. క్రితం కంటే తక్కువగా 28 శాతం పోలింగ్‌ మాత్రమే ఇక్కడ నమోదైంది. చార్మినార్‌ (4ఏ)లో 23.01, చార్మినార్‌ (4బీ)లో 29.59, సర్కిల్‌-5లో 30.59 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాతబస్తీలో వన్‌సైడ్‌గా జరిగే వార్‌ ఫలితాల్లో మార్పులుండే అవకాశముందని చెబుతున్నారు. తక్కువ పోలింగ్‌ నమోదైన నేపథ్యంలో ఎంఐఎం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ పార్టీకి పెట్టని కోటలా ఉన్న ఓల్డ్‌ సిటీలో ఫలితాలు ఎలా ఉంటాయో అని మదనపడుతున్నారు. అయితే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో మాత్రం మజ్లిస్‌కు సీట్లు తగ్గుతాయని, 2009లో 43 స్థానాలతో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు 35 సీట్లతోనే సరిపెట్టుకునే అవకాశముందని స్పష్టమవుతోంది. కోర్‌ ఏరియాలో మరీ తక్కువగా పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం.

No comments:

Post a Comment