Wednesday, February 3, 2016

సీఎం హామీ ఇచ్చారు కాబట్టే రోడ్డెక్కాం: ముద్రగడ

కిర్లంపూడి: జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సమావేశానికి ఏ గ్రామం నుంచి ఎంత మంది వచ్చారో తమ వద్ద లెక్కలు ఉన్నాయని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని తన సొంత గ్రామమైన కిర్లంపూడిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు అమలు చేయమని అడుగుతున్నామని ఆయన అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌ను నేరవేర్చేందుకే శుక్రవారం ఉదయం 9 గంటలకు నేను, నాభార్య ఆమరణ నిరాహారదీక్షకు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.


తమ జాతికి రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దశంతోనే తాను ఉద్యమబాట పట్టానే తప్ప, స్వప్రయోజనాల కోసం కాదన్నారు. కాపులను బీసీల్లో చేర్చాతామని ఆశ చూపి, తమ జాతిని నమ్మించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. కాపు ఐక్య గర్జన సమావేశం జరగకుండా అధికార పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసినందని ఆయన ఆరోపించారు. కాపు ఉద్యమంలో పాలు పంచుకున్న ఏ ఒక్కరికీ దురుద్దేశం లేదన్నారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇచ్చిన జీవోను సీఎం చంద్రబాబు పచ్చి మోసం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాపులకు సంబంధించిన డేటా అంతా సీఎం చంద్రబాబు నాయుడు వద్ద ఉందన్నారు. సీఎం హామీ ఇచ్చారు కాబట్టే, తాను రోడ్డుపైకి వచ్చానని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నా అన్నారు. కాపు రిజర్వేషన్లపై తాను పలుమార్లు లేఖలు రాసినా సీఎం నుంచి సందేశం రాలేదన్నారు. మా జాతికి ఫలాల కోసమే చూస్తున్నానని పేర్కొన్న ముద్రగడ, మీరైనా జీవో ఇవ్వాలని అడుగతున్నానని అన్నారు. కమిషన్‌ పేరుతో ఏళ్ల తరబడి తాత్సారం చేయడం భావ్యం కాదన్నారు. అలా కాకుండా ఇతర బీసీ సంఘాల సోదరులతో చర్చలు జరపడం చంద్రబాబుకు సరికాదని ఆయన సూచించారు. దళితులైనప్పటికీ అంబేద్కర్, దామోదరం సంజీవయ్య తమ జాతికి ఎంతో మేలు చేశారని అన్నారు. 1915లో అంబేద్కర్ బ్రిటన్ వెళ్లి మరీ కాపు రిజర్వేషన్ల కోసం పని చేశారని తన మిత్రులు చెప్పారని ఆయన పేర్కొన్నారు. భారత దేశంలో ఎంతో కాలంగా కాపులకు రిజర్వేషన్లు అమలులో ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటినే అడుగుతున్నామని చెప్పారు. కాపు రిజర్వేషన్‌ ఉద్యమంలో పాల్గొన్న ఎవరికీ దాడులు చేయాలన్న ఉద్దేశం లేదన్నారు. సార్...రమ్మంటున్నారని పిలిచి, నా భార్యను కూడా ఆ రోజు కొందరు అవమానించారని ఆయన తెలిపారు. కాపు ఐక్య గర్జనలో భాగంగా ఆందోళన జరుగుతున్నప్పుడు నలుగురు వ్యక్తులు గెస్ట్‌హౌస్‌లో ఉన్న తన భార్యవద్దకు వెళ్లి సర్ రమ్మంటున్నారని చెప్పారట. నేనైతే ఆవిడను పిలవలేదు. 'మరి, వాళ్లెవరో.. ఎందుకలా అన్నారో' అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మేడపైనున్న వాటర్ ట్యాంక్ ధ్వంసం చేశారని, తనని కూడా అవమానించారని ఆయన చెప్పారు. ఉద్యమం నుంచి వెనక్కి వెళ్లేలా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన పేర్కొన్నారు. సీఎం తలచుకుంటే కాపులకు రిజర్వేషన్ వచ్చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment