Thursday, August 18, 2016

పుష్కరాలకు రాఖీ కళ



తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. శ్రావణ పౌర్ణమి కావడంతో రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లన్నీ భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే పుష్కర స్నానం చేసిన పలువురు ప్రముఖులు కూడా శ్రావణ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని మరోసారి పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దంపతులు కొద్దిసేపటి క్రితం పవిత్ర సంగమం వద్ద పెర్రీ ఘాట్లో పుష్కర స్నానం చేశారు.

ఇటు తెలంగాణలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుసగా నాలుగు రోజుల సెలవల తర్వాత రద్దీ కాస్త తగ్గినా.. రక్షాబంధన్ విద్యార్థులకు, కొంతమంది ఉద్యోగులకు హాలిడే కావడంతో.. మళ్లీ ఘాట్లు కళకళలాడుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విశాలమైన ఘాట్లలో ఎక్కువమంది వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానం చేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లపై జాతీయ ప్రముఖులు కూడా తెలుగు ప్రభుత్వాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Wednesday, August 17, 2016

భక్తులతో పోటెత్తిన కృష్ణా తీరం


కృష్ణా పుష్కరాల మూడో రోజున ఆదివారం పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే దాదాపు 14 లక్షల మందికిపైగా స్నానమాచరించారు. వీరిలో అత్యధికంగా బీచుపల్లిలో 3 లక్షలు, సీఎం కేసీఆర్‌ పుష్కరాలను ప్రారంభించిన గొందిమళ్ల ఘాట్‌, రంగాపూర్‌ ఘాట్‌లలో 1.5 లక్షల మంది వంతున పుష్కర స్నానం చేశారు. ముఖ్యంగా ఆలయాలకు సమీపానగల ఘాట్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. గొందిమళ్ల ఘాట్‌కు వెళ్లే మార్గం అలంపూర్‌ చౌరస్తా నుంచి వాహనాలతో నిండిపోయింది. హై-లెవల్‌ ఘాట్‌వద్ద ఎలాంటి రక్షణ లేకపోయినా పెద్దసంఖ్యలో యాత్రికులు స్నానమాచరించడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత భక్తులు జోగులాంబ అమ్మవారిని దర్శనానికి బారులు తీరగా విపరీతమైన రద్దీ నెలకొంది.
సోమశిలకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్‌ను అమరగిరి ఘాట్‌కు మళ్లించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2వేల మంది ఎన్సెస్సెస్‌ విద్యార్థులు, వెయ్యిమంది వీహెచ్‌పీకార్యకర్తలు, సత్యసాయి సేవా ట్రస్టువంటి సంస్థల సభ్యులు వేలాదిగా యాత్రికులకు సేవలందిస్తున్నారు. భక్తులవద్దకు వెళ్లి తాగునీరు అందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 4.31 లక్షలకుపైగా పుష్కర యాత్రికులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని ఘాట్లలో సమృద్ధిగా నీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. నాగార్జునసాగర్‌, వాడపల్లి, మఠంపల్లి ప్రాంతాలకు తండోపతండాలుగా తరలివచ్చారు.