Wednesday, August 17, 2016

భక్తులతో పోటెత్తిన కృష్ణా తీరం


కృష్ణా పుష్కరాల మూడో రోజున ఆదివారం పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఒక్క మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే దాదాపు 14 లక్షల మందికిపైగా స్నానమాచరించారు. వీరిలో అత్యధికంగా బీచుపల్లిలో 3 లక్షలు, సీఎం కేసీఆర్‌ పుష్కరాలను ప్రారంభించిన గొందిమళ్ల ఘాట్‌, రంగాపూర్‌ ఘాట్‌లలో 1.5 లక్షల మంది వంతున పుష్కర స్నానం చేశారు. ముఖ్యంగా ఆలయాలకు సమీపానగల ఘాట్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది. గొందిమళ్ల ఘాట్‌కు వెళ్లే మార్గం అలంపూర్‌ చౌరస్తా నుంచి వాహనాలతో నిండిపోయింది. హై-లెవల్‌ ఘాట్‌వద్ద ఎలాంటి రక్షణ లేకపోయినా పెద్దసంఖ్యలో యాత్రికులు స్నానమాచరించడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత భక్తులు జోగులాంబ అమ్మవారిని దర్శనానికి బారులు తీరగా విపరీతమైన రద్దీ నెలకొంది.
సోమశిలకు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్‌ను అమరగిరి ఘాట్‌కు మళ్లించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2వేల మంది ఎన్సెస్సెస్‌ విద్యార్థులు, వెయ్యిమంది వీహెచ్‌పీకార్యకర్తలు, సత్యసాయి సేవా ట్రస్టువంటి సంస్థల సభ్యులు వేలాదిగా యాత్రికులకు సేవలందిస్తున్నారు. భక్తులవద్దకు వెళ్లి తాగునీరు అందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 4.31 లక్షలకుపైగా పుష్కర యాత్రికులు పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని ఘాట్లలో సమృద్ధిగా నీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. నాగార్జునసాగర్‌, వాడపల్లి, మఠంపల్లి ప్రాంతాలకు తండోపతండాలుగా తరలివచ్చారు.

No comments:

Post a Comment