Tuesday, January 19, 2016

ఇన్ఫోసిస్ సుధామూర్తి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన

‘మహిళలకి ఇంటర్వ్యూ ఉండదా?!’ అని జేఆర్డీ టాటానే నిలదీసింది. గోల్డ్‌మెడలిస్ట్, ఇంజినీరింగ్‌లో టాపర్, పెద్ద ఉద్యోగం... అయినా మానేసుకుంది! వాళ్లాయన కోసం ఉద్యోగం మానేసుకుంది.  వాళ్ల ఇన్ఫోసిస్ ఇప్పుడు నక్షత్రాలతో ముగ్గులు వేసుకునేంత ఎత్తుకు ఎదిగింది. వెంటనే... సుధ మళ్లీ భూమికి దిగొచ్చేసింది. పిల్లల, పేదల, వృద్ధుల, మహిళల, విధివంచితుల ఆశల పల్లకీని మోస్తోంది. ప్రభుత్వాలకు, పెద్దపెద్ద సంస్థలకు సేవామార్గాలు వేస్తోంది. సదా మీ సేవలో... అనే సుధ తను. చదువుంది, డబ్బుంది, హోదా ఉంది, సేవా తత్వం ఉంది.. అయినా... మూడొందల అరవై ఐదు రోజుల్లో... 365 సినిమాలు చూస్తుంది! ఆమె వివిధ. మన వివిధ సుధ.


గోవాలోని పణజిలో ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు తొమ్మిదవ ‘కొశాంబీ ఫెస్టివల్’ జరుగుతోంది. డి.డి. కొశాంబీ (1907-1966) చరిత్రకారుడు. ఆలోచనాపరుడు. సంఘశ్రేయోభిలాషి. ఆయన ఆలోచనలపై ఈ ఐదు రోజులూ ఐదుగురు సుప్రసిద్ధులు ప్రసంగిస్తారు. వారిలో ఒకరు ‘ఇన్ఫోసిస్ ఫౌండేషన్’ చైర్‌పర్సన్ సుధామూర్తి కూడా ఒకరు. సుధ ప్రారంభోపన్యాసం చేస్తారు. ‘ది సర్కిల్ ఆఫ్ లైఫ్’ అనే అంశం మీద మాట్లాడతారు. ఈ సందర్భంగా సుధామూర్తి లైఫ్ సర్కిల్ చుట్టూ చిన్న రౌండప్.

శిలను ఉలి చెక్కుతుంది. ఉలిని ఆలోచన కదిలిస్తుంది. సుధామూర్తిని కూడా ఆమెకు ఎదురైన అనుభవాలు ఆలోచనలై మలిచాయి. పైకి ఆమె సాధారణ స్త్రీగా కనిపించవచ్చు. కానీ లోలోపల మూర్తీభవించిన ఒక సమున్నత సేవానురాగ వ్యక్తిత్వం ఆమె. సుధ అనుభవాలు కొన్ని.. ఆమె రాసిన ‘వైజ్ అండ్ అదర్‌వైజ్’ పుస్తకంలో ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ భాగం ఆమెకు తారసపడిన వ్యక్తులకు సంబంధించినవే.

హనుమంతప్ప అనే పిల్లవాడు ఉండేవాడు. అతడి చదువుకు, హాస్టల్ ఖర్చులకు సుధ డబ్బు పంపేవారు. ఓసారి ఆ డబ్బు వెనక్కి వచ్చేసింది! కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయారు సుధ. ‘స్కూల్‌కి సెలవులిచ్చారు. సెలవుల్లో డబ్బు అవసరం ఉండదు... అందుకే తిప్పి పంపాను మేడమ్. క్షమించండి’ అని ఆ పిల్లవాడి సమాధానం. ఆ నిజాయితీకి ఆమె కదిలిపోయారు. సుధను ఆమె జీవితంలో కదిలించిన సంఘటనల్లో రెండు రకాలవీ ఉన్నాయి. మంచివీ, చెడువీ! భోరున వర్షం కురుస్తుంటే ఇల్లు తడిసి, కప్పు కారిపోతున్నా, ‘వానా వానా వల్లప్పా..’ అని ఆనందంతో నృత్యం చేసిన ఓ నిరుపేద కుటుంబాన్ని చూసి తన స్నేహితురాలు మీరా... పేదరికానికీ, ఆనందానికీ సంబంధమే లేదన్న జీవిత సత్యాన్ని గ్రహించిన విషయాన్ని సుధ తన అనుభవాలలో రాసుకున్నారు. విమానంలో తన సహ ప్రయాణికులైన అపరిచిత యువ దంపతులు... ‘వీరనారి’ ఝాన్సీ లక్ష్మీబాయి పేరే వినలేదని తెలిసి విస్మయం చెందారు. ఇంకా... రక్షాబంధన్ రోజే ఓ తమ్ముడు తన అక్కను పడువు వృత్తిలోకి నడిపించడం, తమిళనాడులోని స్వామిమలై సమీపంలోని ఒక ఆలయంలో అంధుడైన  పూజారి.. తను ఇచ్చిన ఐదు వందల నోటును తడిమి చూసి, ‘అంత డబ్బును తనకు అక్కర్లేదు’ అని ఐదు పావలా బిళ్లలను మాత్రమే తీసుకోవడం వంటి పరస్పర విరుద్ధ సంఘటనలు సుధలో ఆలోచనలను రేకెత్తించి ఆమె వ్యక్తిత్వాన్ని రూపుదిద్దాయి.

మహిళలు ఎందుకు వద్దు?
సుధా కులకర్ణి. బెంగుళూరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క్యాంపస్ విద్యార్థిని. లేడీస్ హాస్టల్లో ఉండి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఓరోజు ఆమె... లెక్చర్ హాల్ కాంప్లెక్స్ నుంచి హాస్టల్‌కు తిరిగి వెళుతుంటే నోటీస్ బోర్డులో టెల్కో (ఇప్పటి టాటా మోటార్స్) కంపెనీ ఉద్యోగ ప్రకటన కనిపించింది. ‘‘కష్టించి పని చేయగల అత్యుత్తమ ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లకు టెల్కో ఆహ్వానం పలుకుతోంది. ఆసక్తిగల గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు’’ అన్నది సారాంశం.దాని కిందే చిన్న నోట్ : మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేయనవసరం లేదు.

నోట్ చదవగానే సుధ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు. అందులోని లైంగిక వివక్షను ఆమె సహించలేకపోతోంది. నిజానికి ఆమెకా ఉద్యోగం చెయ్యాలని లేదు. కానీ నోట్ చూశాక ఆ కంపెనీ యజమానికి కనువిప్పు కలిగించాలని గట్టిగా నిర్ణయించుకుంది. హాస్టల్ గదికి రాగానే పోస్ట్ కార్డు అందుకుని జె.ఆర్.డి. టాటాకు ఉత్తరం రాయడం మొదలు పెట్టింది. టెల్కో టాటా వాళ్లది కాబట్టి, టాటాకు అధినేత జె.ఆర్.డి. కాబట్టి నేరుగా ఆయన్నే ఉద్దేశించే రాసింది. వాస్తవానికి అప్పటి టెల్కో ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్. ‘‘టాటాలంటే గొప్పవాళ్లు. ఇండియాకు రక్తమాంసాలు ఇచ్చినవాళ్లు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విద్యాసంస్థల ఆవిర్భావం టాటాల పుణ్యమే. అదృష్టవశాత్తూ నేనక్కడే చదువుకుంటున్నాను. కానీ టెల్కో వంటి టాటా కంపెనీ లైంగిక వివక్షను పాటించడం నాకు ఆశ్చర్యంగా ఉంది’’.ఇంతవరకు రాసి సుధ ఆ ఉత్తరాన్ని డెరైక్టుగా జె.ఆర్.డి.కి పోస్ట్ చేశారు. తర్వాత ఆ విషయం మరిచిపోయారు.

వారం తర్వాత...
సుధకి టెలిగ్రామ్ వచ్చింది. టెల్కో ఇంటర్వ్యూకి రమ్మని!! పుణె దగ్గర పింప్రీలో ఇంటర్వ్యూ. సుధ వెళ్లింది. బోర్డు సభ్యులలో ఒకరు సుధను చూస్తూ -‘‘ఈ అమ్మాయే జె.ఆర్.డి.కి ఉత్తరం రాసింది’’అని పక్కన ఉన్నవాళ్లకు చెప్పడం ఆమె గమనించింది. ఏదో పిలవడానికి పిలిచారు కానీ, తనకా ఉద్యోగం రాదని సుధ అనుకుంది. అందుకే నిర్లక్ష్యంగా సమాధానాలిచ్చింది. పనిలో పనిగా అమ్మాయిలను ఉద్యోగాలకు వద్దనడం న్యాయమేనా? అని అడిగింది.ఇంటర్వ్యూ చేస్తున్నవాళ్లలో ఒక పెద్దాయన సౌమ్యంగా సమాధానం చెప్పారు. ‘‘చూడమ్మా... ఇది కో-ఎడ్యుకేషన్ కాలేజీ కాదు. కర్మాగారం. మీలాంటి ప్రతిభ గల అమ్మాయిల్ని రిసెర్చ్ లేబరేటరీలలోకి తీసుకోగలం కానీ, చూస్తూ చూస్తూ యంత్రాల మధ్యకు పంపలేం కదా. అందుకే అలా నోట్ పెట్టాం’’ అన్నారు.

‘‘ఎక్కడో ఒక చోట ఈ సంప్రదాయానికి బ్రేక్ పడాలి కదా’’ అంది సుధ. ఆమె అన్నట్లే బ్రేక్ పడింది. ఆమెకా ఉద్యోగం వచ్చింది. తర్వాత సుధా కులకర్ణి... సుధామూర్తి అయింది. అయితే పుణె నుంచి బాంబే బదలీ అయ్యేవరకు ఆమెకు జె.ఆర్.డి. దర్శనభాగ్యమే కలగలేదు. కంపెనీ ఛైర్మన్ సుమంత్ మూల్గావ్‌కర్‌కు ఏవో నివేదికలు అందించడం కోసం బాంబే హౌస్ ఫస్ట్ ఫ్లోర్‌లో వేచి ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఓరోజు అమెకు జె.ఆర్.డి. కనిపించారు. అదే మొదటిసారి సుధ ఆయన్ని చూడ్డం!

ఫస్ట్ ఉమన్ ఇంజినీర్

‘‘జే.. టెల్కో ఫ్యాక్టరీలో చేరిన మొట్టమొదటి ఉమన్ ఇంజినీర్’’ అంటూ సుధను పరిచయం చేశారు సుమంత్. సుధలో వణుకు మొదలైంది. దేవుడా పోస్ట్ కార్డ్ సంగతి ఎత్తకుండా చూడు అనుకుంది. జె.ఆర్.డి. చిరునవ్వు నవ్వి సుమంత్‌తో మాటల్లో పడిపోయారు.
 ఆ తర్వాత అప్పుడప్పుడు టాటాహౌస్‌లో జె.ఆర్.డి. తారసపడుతూనే ఉన్నారు సుధకు.

రాజీనామా!
1982లో టెల్కో నుంచి బయటికి వచ్చారు సుధ. నిజానికి అంతమంచి ఉద్యోగం మానేసి వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితి. ఫైనల్ సెటిల్‌మెంట్‌లన్నీ అయ్యాక బాంబే హౌస్ మెట్లు దిగుతుంటే జె.ఆర్.డి. ఎదురయ్యారు ఆమెకు. ఏదో ఆలోచనలో ఉన్నారు. ఆయన దగ్గర వీడ్కోలు తీసుకోవడం కోసం ఆగారు సుధ. ‘‘ఎలా ఉన్నావమ్మాయ్’’ అని అడిగారు జె.ఆర్.డి. ‘‘ఉద్యోగం మానేస్తున్నాను సర్’’ అని చెప్పింది సుధ.‘‘మానేసి?’’ ‘‘పుణె వెళ్లిపోతున్నాను సర్. నా హస్బెండ్ అక్కడ ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. పేరు ఇన్ఫోసిస్’’.
   
అరవై ఐదేళ్ల సుధామూర్తి ప్రస్తుతం ‘ఇన్ఫోసిస్ పౌండేషన్’కు ఛైర్ పర్సన్. ‘గేట్ ఫౌండేషన్’ సభ్యురాలు. అనాథాశ్రమాలను నడుపుతున్నారు. కంప్యూటర్ విద్యను ఒక ఉద్యమంలా కర్నాటక లోని ప్రభుత్వ పాఠశాలలకు అందుబాటులోకి తెస్తున్నారు.  ఇవి వృత్తి వ్యాపకాలు. సుధ చక్కటి రచయిత్రి. కథలు రాస్తారు. కన్నడలో ఆమె రాసిన ‘డాలర్ సొసె’ ఇంగ్లిషు లోకి ‘డాలర్ బహు’ (డాలర్ కోడలు)గా తర్జుమా అయింది. జీ టీవీలో సీరియల్‌గా వచ్చింది. మరాఠీ సినిమా ‘పితృరూణ్’, కన్నడ చిత్రం ‘ప్రార్థన’లో ఆమె నటించారు. ఇవి ప్రవృత్తి జ్ఞాపకాలు. ఈ వ్యాపకాలు, జ్ఞాపకాల మధ్య సుధ తనని తాను నిత్యనూతనం చేసుకుంటున్నారు. సుధామూర్తికి ఇరవై వరకు ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చాయి. వాటిల్లో ఒకటి ‘పద్మశ్రీ’.

సామాజిక కార్యకర్తగా...
సుధ విషయంలో కార్యకర్త అనేమాట చిన్నదవుతుంది. ఏ పని చేసినా ఆమె దాన్నొక ఉద్యమంగానే నడిపారు. అలాగని తననొక ఉద్యమకారిణిగా ఆమె అంగీకరించరు. ఆరోగ్యం, విద్య, స్త్రీ సాధికారత, పరిశుభ్రత, కళలు-సంస్కృతి, పేదరిక నిర్మూలన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి.. సుధ కృషి చేస్తున్న రంగాలు. ఆమె ప్రతి మాటా ఒక కోట్ లా ఉంటుంది. ‘పోరాటమే జీవితం’ అంటారు సుధామూర్తి. ‘మన పోరాటం మన జీవితం కోసం మాత్రమే కాకూడదు’ అని కూడా అంటారు. జె.ఆర్.డి. టాటా ఆమెకు ఆదర్శం. టెల్కోలో ఉద్యోగం మానేస్తూ బయటికి వస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట సుధకు ఈనాటికీ వేద వాక్కు. ‘డబ్బుకు మనం సొంతదారులం కాదు. సంరక్షకులం మాత్రమే. నువ్వు విజయం సాధించినప్పుడు, ఆ విజయంలో సమాజం నీకిచ్చిన సహకారం కూడా ఉంటుంది కాబట్టి, ఆ సహకారాన్ని తిరిగి నువ్వు నీ సమాజానికి ఇవ్వాలి’ అని జేఆర్‌డీ చెప్పిన మాటను నేనెప్పటికీ మరువలేను అంటారు సుధామూర్తి తన ప్రతి ప్రసంగంలో, ప్రతి ప్రస్తావనలో.

చుట్టూ మసులుతున్న మనుషుల్లోని మంచితనాన్ని గమనించేంత సమయం, సానుకూల దృష్టి ఉంటే మనలో ప్రతి ఒక్కరి జీవితం సమాజానికి ఉపయోగపడుతుందన్నన్న విషయాన్ని సుధామూర్తి జీవనశైలి ప్రతిఫలిస్తుంది.

సుధ 1950 ఆగస్టు 19న షిమోగా (కర్నాటక)లో జన్మించారు. తండ్రి ఆర్.హెచ్. కులకర్ణి. తల్లి విమల కులకర్ణి. తమ్ముడు శ్రీనివాస్ కులకర్ణి. కాలిఫోర్నియాలో ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్. అక్కా తమ్ముడు చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరిగారు. ఆ జ్ఞాపకాలతో సుధ ‘హౌ ఐ టాట్ మై గ్రాండ్‌మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్’. రాశారు. ఇవి పిల్లల కథలు. ఇదే ఆమె తొలి రచన. ఆ తర్వాత ఇప్పటి వరకు కన్నడంలో 16, ఇంగ్లిషులో 13 రచనలు చేశారు సుధ. ఆమె భర్త నారాయణమూర్తి ఐటీ దిగ్గజం. ఇన్ఫోసిస్ కో ఫౌండర్. సుధ కొడుకు రోహన్. కోడలు లక్ష్మీ వేణు. కూతురు అక్షత. అల్లుడు రిషి సునక్. రోహన్, అక్షత అక్కాతమ్ముళ్లు.

సినిమాలంటే ఇష్టం!

సుధామూర్తి దగ్గర 500 సినిమా డీవీడీలు ఉన్నాయి. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది. ‘‘రోజుకు కనీసం ఒక సినిమా అయినా చూస్తాను.  సినిమాలు నాకు ఎప్పటికీ బోరు కొట్టవు.  నిజానికి నేను సినిమా జర్నలిస్టును కావాలనుకున్నాను’’ అని ఓసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సుధ.

1 comment:

  1. sudha murty gaari gurinchi chaala chakkaga raasaru. ame pustakalu telugulo vacchinayi. vati perlu kooda rasi vunte pathakulaku marintha aanandam kaligedi. aavida jeevitamlo paatinchina, paatistunna viluvalu entho vunnataminavi, andaroo acharincha thaginavi.

    ReplyDelete