Friday, April 1, 2016

వడ్డీరేట్ల కోత నేటి నుంచే...

న్యూఢిల్లీ: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), కిసాన్ వికాస పత్ర (కేవీపీ), సీనియర్ సిటిజన్ డిపాజిట్లు, బాలికా పొదుపు పథకం- సుకన్యా సమృద్ధి యోజనసహా పలు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై శుక్రవారం నుంచీ వడ్డీరేట్లు తగ్గుతున్నాయి. మూడు నెలలకోసారి మార్కెట్ రేటుకు అనుగుణంగా చిన్న పొదుపు రేట్లను సవరించాలన్న కేంద్ర నిర్ణయం నేపథ్యంలో ఆయా పొదుపు పథకాలపై 1.3 శాతం వరకూ వడ్డీరేటు తగ్గనుంది. ప్రతి త్రైమాసికానికీ... ముందు నెల 15వ తేదీ చిన్న పొదుపులపై రేట్లను సమీక్షిస్తారు.

దీని ప్రకారం జులై నుంచి సెప్టెంబర్ మధ్య అమలయ్యే వడ్డీరేటు జూన్ 15న నిర్ణయమవుతుంది. ఈ వడ్డీ రేట్లకు ప్రాతిపదికగా అంతకు ముదు మూడు నెలల ప్రభుత్వ బాండ్ల రేటును తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధికి దోహద పడేలా వ్యవస్థను తక్కువ స్థాయి వడ్డీరేటులోకి మార్చాలన్న కేంద్రం లక్ష్యంలో భాగంగా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర వ్యాధులు, పిల్లల విద్య వంటి తప్పని అవసరాలకైతే పీపీఎఫ్ అకౌంట్ల ముందస్తు ఉపసంహరణలకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే అకౌంట్ ప్రారంభమై ఐదేళ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. మొత్తం డిపాజిట్‌పై చెల్లించే వడ్డీలో ఒకశాతం జరిమానాగా ఉంటుంది.

 తగ్గే రేట్లు ఇలా...
♦ కిసాన్ వికాస్ పత్రాలపై వడ్డీ రేటు తగ్గటంతో 100 నెలలకు (ఎనిమిది సంవత్సరాల నాలుగు నెలలు) రెట్టింపు అవుతున్న పొదుపు ఇకపై 110 (తొమ్మిది సంవత్సరాల రెండు నెలలు) నెలలకు రెట్టింపవుతుంది.
♦ తపాలా సేవింగ్స్‌పై రేటు 4 శాతంగా కొనసాగుతుంది.
♦ {పజాదరణ కలిగిన ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్‌పై వడ్డీ 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గింది.
♦ ఐదేళ్ల మంత్లీ ఇన్‌కమ్ డిపాజిట్లపై కూడా వడ్డీ 8.4 శాతం నుంచి 7.8 శాతానికి దిగింది.
♦ పోస్టాఫీస్ ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లపై 8.4 శాతం వడ్డీ వస్తుండగా... ఇకపై ఏడాది టర్మ్ డిపాజిట్‌పై 7.1 శాతం, రెండేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.4 శాతం వడ్డీ అందుతుంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై రేటు 8.5 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గింది. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై రేటు 8.4 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది.
♦ సామాజిక అభివృద్ధి పథకంగా పేర్కొని, గత సమీక్షలో మినహాయించిన సుకన్యా సంమృద్ధి యోజనపై వడ్డీని కూడా 9.2 నుంచి 8.6 శాతానికి తగ్గించారు.
♦ గత సమీక్ష సందర్భంగా మినహాయింపు పొందిన  ఐదేళ్లసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌దీ ఇదే పరిస్థితి. మార్చి 18నే ఈ రేటు 9.3 శాతం నుంచి 8.6 శాతానికి తగ్గింది.
♦ ఒకటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి పోస్టాఫీస్ టర్మ్ డిపాజిట్లు, కిసాన్ వికాస పత్రాలు, ఐదేళ్ల రికరింగ్  డిపాజిట్‌పై ఇప్పటి వరకూ... ఇదే కాలాలకు సంబంధించి ప్రభుత్వ బాండ్లకన్నా అదనంగా పావుశాతం రేటు అందుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రయోజనం ఏప్రిల్ 1 నుంచి అందదు.
♦ ఫిబ్రవరి 16 ‘త్రైమాసిక సమీక్ష’ నిర్ణయం సందర్భంగా షార్ట్ టర్మ్ పోస్టాఫీస్ డిపాజిట్లపై 0.25 శాతం రేటు తగ్గించిన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం, సామాజిక భద్రతా పథకాల పేరిట దీర్ఘకాల పథకాలు బాలికా, సీనియర్ సిటిజన్, ఎంఐఎల్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, పీపీఎఫ్‌ల విషయంలో వడ్డీరేటు కోత నిర్ణయాన్ని తీసుకోలేదు. ఆ తర్వాతి త్రైమాసికంలో (మార్చి 18న తీసుకున్న నిర్ణయం ప్రకారం) ఈ మినహాయింపులు తొలగించడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.

No comments:

Post a Comment