ఈసారి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మార్చి దాటకుండానే మండిపోతున్నాడు సూర్యుడు. ఈ నెలలో ఉండాల్సిన దాని కంటే మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చెండాడే ఎండలతీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం. మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. ఈ పరిస్థితుల్లో వడదెబ్బకు చాలా తేలికగా గురయ్యే అవకాశం ఉంది. అయితే వడదెబ్బపై అవగాహన ఉంటే ఆ ఉష్ణోగ్రతా ఉత్పాతాన్ని అంతే తేలిగ్గా తప్పించుకునే అవకాశం ఉంది. వడదెబ్బను కాచుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం.
నీడ పట్టునే ఉన్నా వడదెబ్బ రిస్క్!
ఒకవేళ మనం నీడపట్టునే ఉన్నా లేదా ఫ్యాన్ గాలి తగులుతూనే ఉన్నా... మన పరిసరాల్లోని తీవ్రమైన ఉష్ణోగ్రతతో వల్ల ఆ వేడిగాలి వల్ల కూడా వడదెబ్బ తగలవచ్చు. సాధారణంగా వడగాడ్పులు (హీట్ వేవ్స్) ఎక్కువగా ఉన్న సమయంలో దీనికి గురవుతుంటారు. దీన్ని నాన్ ఎగ్జర్షనల్ హీట్‌స్ట్రోక్ లేదా క్లాసిక్ హీట్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఇంటిలోనే ఉన్నప్పటికీ తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల వయోవృద్ధులు, చిన్నపిల్లలు దీనికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఏసీ సౌకర్యాలు లేని వాళ్లకు, సరిగా గాలి సోకని ప్రదేశాల్లో (సరైన వెంటిలేషన్ లేని చోట) ఉండేవారికీ ఇది తగిలే అవకాశం ఎక్కువ.
వడదెబ్బను గుర్తించండిలా...
శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్‌హీట్ (40.6 సెంటీగ్రేడ్) కంటే ఎక్కువ పెరుగుతుంది. ముఖంలోకి రక్తం చిమ్ముకొచ్చినట్లుగా ఎర్రగా మారుతుంది (ఫ్లషింగ్) చాలా వేగంగా శ్వాస తీసుకుంటుంటారు.
అయోమయం కొందరిలో ఫిట్స్
చాలా ఎక్కువ జ్వరం, స్పృహలో లేకపోవడం / అయోమయం (కన్ఫ్యూజన్); కుదురుగా ఉండలేకపోవడం; భ్రాంతులు, చికాకు, కోపం వంటి భావోద్వేగాలు కనిపిస్తాయి. ఇక చివరగా కోమాలోకి వెళ్తారు.
ఇతర కాంప్లికేషన్లు...
మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్)బీపీ తగ్గడం శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తస్రావం (ఉదాహరణకు ముక్కురంధ్రాల వంటి భాగాల నుంచి) అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్) ఇలాంటి అన్ని పరిస్థితి ఏదైనా కనిపిస్తే వెంటనే బాధితులను ఆసుపత్రిలో చేర్చాలి.
ఎవరిలో ఎక్కువ
న్నపిల్లలు, వృద్ధులు దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వారు (క్రానిక్ పేషెంట్స్) ఆరుబయట పనిచేయాల్సి ఉన్న పోలీసు వంటి వృత్తుల్లో ఉన్నవారు {Mీడాకారులు
స్థూలకాయులు
మద్యం తీసుకునేవాళ్లు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు... ఉదాహరణకు కోకైన్, యాంఫిటమిన్స్, ఎల్‌ఎస్‌డీ, ఎఫిడ్రిన్ వంటివి తీసుకునేవాళ్లు. కొన్ని మందులు వాడే వారు... ఉదాహరణకు దాహాన్ని తగ్గించే హ్యాలోపెరిడాల్ మందులు తీసుకునేవారిలో... చెమటను తగ్గించే మందులైన యాంటీహిస్టమైన్స్, యాంటీకోలినెర్జిక్, ఫీనోథయజైన్స్, బీటాబ్లాకర్స్ తీసుకునేవాళ్లలో హార్ట్ పేషెంట్స్ వాడే డైయూరెటిక్స్ మందులు (మూత్రం ఎక్కువగా పోయేలా చేసే మందులు). పొడి చర్మం ఉన్నవాళ్లు, వేడి చర్మం ఉన్నవాళ్లు స్వేదరంధ్రాలు తక్కువగా ఉండేవారిలో వడదెబ్బ తగిలేందుకు అవకాశాలు ఎక్కువ.
నివారణ...
సాధ్యమైనంత మట్టుకు నీడలోనే ఉండాలి. బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉదయం 10 గంటలకు ముందుగాని... సాయంత్రం చల్లబడ్డ తర్వాత గాని బయటిపనులు చూసుకోవాలి. ఇంటి కిటికీలను తెరచి గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అయితే వేడిగాలి రాకుండా, గది చల్లగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎండకు వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకువెళ్లడం, వెడల్పు అంచులున్న హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంతగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి. శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు వేసిన ద్రవాలు ఇవ్వాలి. చెమటను గ్రహించే, చల్లగా ఉంచే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. వడదెబ్బకు దోహదం చేసే మందులు డాక్టర్ సలహామేరకు మోతాదు తగ్గించడంగాని లేదా ఆపేయడంగాని చేయాలి. వడదెబ్బ నివారణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి. ఈ వేసవిలో శీతలపానీయాలు (ఏరేటెడ్ కూల్‌డ్రింక్స్) మంచివి కాదు. వాటికి బదులు కొబ్బరిబొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరం కోల్పోయే లవణాలను భర్తీ చేయవచ్చు.
వడదెబ్బ తగిలిన వాళ్లలో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ లేకుండా పెరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో చూద్దాం. మన దేహం నార్మల్ శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్. ఆ ఉష్ణోగ్రత వద్ద మన జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి. మన శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా ఉండేలా హైపోథెలామస్ అనే కీలకభాగం చూస్తుంటుంది. ఎంత ఎండలోనైనా మన శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గానే ఉంటుంది. మహా అయితే అది 99.9 ఫారెన్‌హీట్ వరకు పెరిగి, మళ్లీ నీడకు రాగానే నార్మల్‌కు వచ్చేస్తుంది. అయితే ఇలా దేహం మళ్లీ శరీరం ఉష్ణోగ్రతను నార్మల్‌కు తీసుకురాలేని పరిస్థితి వస్తే దాన్ని ‘వడదెబ్బ’గా పరిగణిస్తారు.
వడదెబ్బ సాధారణ లక్షణాలు...
చర్మం స్వేదాన్ని ఇక స్రవించలేని పరిస్థితికి రావడం. తలనొప్పి వికారం, కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) ముఖ్యంగా పిక్కలు పట్టేయడం (క్రాంప్స్ ఇన్ కాఫ్ మజిల్స్) వాంతులు కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వడదెబ్బ తీవ్రతను సరిగా అంచనా వేయడంలో లోపంగాని, లేదా గుర్తించక సకాలంలో ఆసుపత్రికి తరలించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.
కీలక అవయవాలపై దుష్ర్పభావాలు...
వడదెబ్బ ప్రభావం అన్ని కీలకమైన అవయవాలపై పడుతుంది. గుండె, మూత్రపిండాలు, కండరాలు, కాలేయం, రక్తం గడ్డకట్టే వ్యవస్థ (కోయాగ్యులేషన్ సిస్టమ్)... ఇలా వీటన్నింటిపై వడదెబ్బ దుష్ర్పభావాలు ఉంటాయి. అయితే సరైన సమయంలో వడదెబ్బ లక్షణాలను గుర్తిస్తే ఆ దుష్ర్పభావాలను నివారించవచ్చు.
చికిత్స...
వడదెబ్బ తగిలినప్పుడు అత్యవసరంగా వైద్యచికిత్స అందించాలి. దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిస్తారు. అలాంటి సమయాల్లో చికిత్స పరంగా అనుసరించే ప్రక్రియలివి... శరీరం వెంటనే చల్లబడేలా చేస్తారు. ఐస్ వాటర్ టబ్‌లో తల, చేతులు, మోకాళ్ల కిందభాగం ఉండేలా చేయాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారిన్‌హీట్‌కు తగ్గిన వెంటనే ఇలా నేరుగా ఐస్‌తో చల్లబరిచే ప్రక్రియను ఆపాలి. అయితే ప్రతి 5 నిమిషాలకు ఓసారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ ఉండాలి.శరీరానికి చల్లటి గాలి తగిలేలా విసనకర్రలతో విసరడం వంటివి చేయాలి.ఐస్‌ప్యాక్ ఉపయోగించాలి. ఐస్ టబ్ లేకపోతే ఐస్‌ప్యాక్స్‌ను నుదుటిమీద, మెడ, చంకల్లో, గజ్జల్లో పెట్టవచ్చు.
మామూలుగా ఐస్ వాడటం వంటి సర్ఫేస్ కూలింగ్ అని పిలిచే ప్రక్రియలతో ప్రయోజనం లేనప్పుడు, పేషెంట్ అపస్మారక స్థితిలో ఉండి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు రోగిని ఐసీయులో చేర్చి ‘ఇంటర్నల్ కూలింగ్ మెథడ్స్’ అవలంబిస్తారు. ఉదాహరణకు ... పొట్టలోకి చల్లటి సెలైన్ (గ్యాస్ట్రిక్ లవాజ్) పంపుతారు. అలాగే ఉదరకుహరం (పెరిటోనియల్ క్యావిటీ)లోకీ చల్లటి సెలైన్ పంపి రక్తాన్ని చల్లబరుస్తారు. దీన్ని పెరిటోనియల్ లవాజ్ అంటారు.
No comments:
Post a Comment