Monday, May 16, 2016

గుడికి వెళ్లేవారు ఇవి పాటిస్తున్నారా..?

ప్రతి రోజూ గుడికి వెళ్లే పద్దతిని మన పెద్దలు మనకు చిన్నతనం నుంచే అలవాటు చేశారు. గుడికి వెళ్ళడమంటే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలుకూడా ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం. అసలు గుడి ఎప్పుడు ఎందుకు వెళ్ళాలి, గుడులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలన్న విషయంపై వేదాలు ఏం చెప్పున్నాయి. మరియు పాటించాల్సిన నియమాలేంటి అన్న విషయాలను తెసుకోవడం చాలా అవసరం. 



మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.



భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి. 



దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.



ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. మరి ఇంతటి పవిత్రమైన గుడికి వెళ్ళేటప్పుడు మనం ఏవిధంగా వెళ్ళాలి...పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకోవడం ద్వారా మరింత పుణ్య ఫలం దగ్గించుకోవచ్చు...

గుడికి వెళ్లేవారు తప్పక పాటించాల్సిన నియమాలు 
  • తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
  • ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి.
  • శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
  • ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
  • దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
  • దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
  • దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
  • పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
  • యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
  • శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
  • ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
  • తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
  • తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహ మునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
  • ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ, వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
  • ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి)దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
  • నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ), నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికిప్రీతికరము.
  • జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
  • ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి
  • ఆలయం వద్ద భక్తులు గట్టిగా అరవటం, నవ్వటం, ప్రాపంచిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడటం చేయరాదు.
  • గుడి పరిసర ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. కొబ్బరి పెంకులూ, అరటి తొక్కలు గుడిలో నియమించిన నిబంధనల ప్రకారం తోట్టిల్లోనే వేయాలి. త్రోసుకుంటూ లేదా ముందువారనిని దాటుకుంటూ దైవ దర్శనం చేసుకోరాదు.
  • దేవుడ్ని కనులారా చూసి ఆ తరువాత కనులు మూసుకొని ప్రార్థన చేయాలి. గుడిలో నిల్చుని తీర్థం పుచ్చుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్థం పుచ్చుకోవాలి.
  • దీపారాధన శివునికి ఎడమవైపూ, విష్ణువుకు కుడివైపూ చేయాలి. అమ్మవారిని నూనె దీపమయితే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడి వైపు వెలిగించాలి.


No comments:

Post a Comment