Friday, April 15, 2016

సీతారాముల కళ్యాణము చూతము రారండి.....


తెలుగునాట సీతారామ కల్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, చైత్రశుక్ల పాడ్యమి ఉగాది నుంచి నవమి వరకు అంటే సీతారామకల్యాణం వరకు తెలుగు వారు పెళ్లిళ్లు చేసుకోరు. భద్రాచలంలోనూ, ఇతర దేవస్థానాల్లోనూ సీతారామ కల్యాణం అయిన తర్వాత ఆ కల్యాణ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరించి, శిరస్సున ధరించి నవమి తర్వాత ముహూర్తాలు పెట్టుకొని పెళ్లిళ్లు చేసుకుంటారు.  భారతీయ సంస్కృతిలో వయస్సులో పెద్దవారైన జంటను చూస్తే ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల తోనూ, యౌవనంలో ఉన్న జంటను సీతారాములతోనూ పోల్చడం పరిపాటి. ఎందుకంటే పురుషోత్తముడు అంటే రాముడే. ఆదర్శ నారీమణి అంటే సీతయే. భిన్న దృక్పథాలు కలిగిన ఇద్దరిని ఒక్కటి చేసి బంధాలను దృఢం చేసే సంస్కారానికే వివాహమని పేరు. ఈ జగత్తుకు కల్యాణ సంస్కృతిని నేర్పిన జంట సీతారాముల జంట. ఆదర్శవంతమైన జంట. ఎన్నో వేల ఏళ్ల క్రితం జరిగిన కల్యాణాన్ని ఈనాటికీ మనం శ్రీరామ నవమినాడు ఆచరిస్తున్నాం అంటే వారి కల్యాణానికి ఎంతటి ప్రాముఖ్యం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.


మాధవుడు మానవుడుగా అవతరించాడు. అతీత మానవుడుగా కాదు. సామాన్య మానవుడుగా పంచభూతాల సమ్మేళనంతో రూపొందే శరీరంతో జన్మించాడు. అది పార్థివ దేహం. భూసంబంధమైన లక్షణాలన్నీ ఆ దేహానికీ ఉంటాయి. ఆకలిదప్పులూ, ఆనందాలూ, ఆవేదనలూ, కష్టాలూ, కన్నీళ్లూ, సుఖాలూ ఆనందభాష్పాలూ అన్నీ ఉంటాయి. ఈ ద్వంద్వాలన్నింటినీ అనుభవించాల్సిందే! శ్రీరాముడు అనే మానవుడుగా జన్మించిన భగవంతుడు అన్నింటినీ అనుభవించాడు. మానవుడుగానే మరణించాడు. సహజ మానవుడుగా, స్వచ్ఛ మానవుడుగా, సార్థక మానవుడుగా జీవించాడు. మానవ సహజంగానే తనువు చాలించాడు.
 
అయితే, మానవుడుగా పుట్టి, మానవుడుగా గిట్టిన శ్రీరాముడు ఇలమీద వేలుపు అయ్యాడు; ఇలవేలుపు అయ్యాడు! ఎందుకు? మానవుడుగా ఆయన గడిపింది ఆదర్శ జీవనం. ధర్మాధర్మ జీవనం. ధర్మం అనేది ఒక మహాశక్తి. విశాల విశ్వసృష్టి విన్యాసం ధర్మం మీదనే ఆధారపడి ఉందంటున్నాయి భారతీయ ధార్మిక దార్శనిక గ్రంథాలు ‘ధర్మం’ అంటే ఏమిటో మహాభారతం బహు చక్కగా చెప్పింది. ‘ఇతరులు ఏమి చేస్తే నీకు అప్రియాన్ని (కష్టాన్ని) కలిగిస్తుందో, దానిని ఇతరులకు నువ్వు చేయకుండా ఉండటమే ధర్మం’ అంటూ అరటిపండు ఒలిచినట్టు చెబుతుంది భారతం. సమస్త సృష్టికీ మూలాధారమైన ఆ ధర్మాన్ని - మనిషిగా పుట్టిన ప్రతివాడూ ఆచరిస్తూ జీవయాత్ర గడిపినందుకు శ్రీరాముడు దేవుడయ్యాడు. ఆయన ఆలోచనా, అభివ్యక్తీకరణా, ఆచరణా ఒక్కటే! మనసు ఒకటీ, మాట ఒకటీ, చేత ఒకటీ కాదు.
 
మానవ జీవితంలో ఆచరించాల్సిన ధర్మసంబంధమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులను గౌరవించడం, తోడబుట్టినవాళ్లను ప్రేమించడం. తోటిమానవులను ఆదరించడం. నిస్సహాయులను ఆదుకోవడం. ఏకపత్నీవ్రతం పాటించడం. ముఖ్యంగా సర్వకాల సర్వ అవస్థలలోనూ సత్యాన్నే పలకడం. ‘సత్యం వద, ధర్మంచర’ అన్నాయి మన శాస్త్రాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే శ్రీరాముడు కేవలం సత్యాన్నే పలికాడు. కేవలం ధర్మాన్నే ఆచరించాడు. ఆయన మాట మహాసత్యం. మనుగడ మహాధర్మం.

శ్రీమహావిష్ణువు ధర్మాన్ని ఉద్ధరించడానికి మాత్రమే కాదు, ఆచరించి చూపిస్తూ ధర్మాన్ని మానవజాతికి బోధించడానికి శ్రీరాముడుగా జన్మించాడు. ధర్మప్రవర్తననూ, సత్యవచన శిల్పాన్నీ మనిషికి నేర్పించడానికి జన్మించాడు. మనిషి మనీషిగా, పురుషుడు ఉత్తమపురుషుడుగా జీవించి తరించే విధానాన్ని విశదీకరించడానికి జన్మించాడు. ఆచరించి చూపిస్తూ ఆదర్శ పురుషుడుగా వెలుగొందాడు. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని మనకు గుర్తు చేస్తూ ఉంటాడు రామకథను మనకు బహూకరించిన వాల్మీకి మహాకవి. రూపం దాల్చిన ధర్మమే రాముడు అంటాడాయన. బాల్యంలో ధర్మం తప్పని బాలుడు ఆయన. యవ్వనంలో ధర్మం తప్పని యువకుడు. ధర్మం తప్పని వీరుడు. మానవాళికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముడు అన్నిటా ఆదర్శప్రాయుడే. ఆయన ఆదర్శపుత్రుడు. ఆదర్శ సోదరుడు. ఆదర్శ యువరాజు. ఆదర్శ వనవాసి. ఆదర్శ వీరుడు. ఆదర్శ భర్త. ఆదర్శ పాలకుడు. సత్యధర్మాలు ప్రాతిపదికగా, ప్రజాశ్రేయస్సే పరమావధిగా సాగిన ఆయన పరిపాలన ఆదర్శపాలన అయింది. ఆయన రాజ్యం ‘రామరాజ్యం’ అయింది.
 
శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడు అన్నది జగమెరిగిన సత్యం. తండ్రి మాట ఆయనకు వేదం. తండ్రి ఆజ్ఞ భగవంతుని ఆజ్ఞతో సమానం. ప్రజారంజకమైన పరిపాలనలో కూడా ఆయనకు తండ్రి ఆదర్శం. ప్రవర్తన అయినా, పరిపాలన అయినా శ్రీరామచంద్రుడు తన పితృపితామహులనూ, సూర్యవంశ మూలపురుషులను ఆదర్శంగా స్వీకరించాడు. అయితే ఒక విషయంలో ఆ మూలపురుషులలో కొందరిని కానీ, దైవంగా భావించి ఆరాధించే తండ్రిని కానీ ఆదర్శంగా తీసుకోలేదు. అదే వివాహ విషయం. తనది సూర్యవంశం. సూర్యుడి తండ్రి కశ్యపుడు. ఆయనకు భార్యలు పదముగ్గురు! సాక్షాత్తూ తన తండ్రికి ముగ్గురు భార్యలు. కానీ శ్రీరామచంద్రుడు ఏకపత్నిని స్వీకరించి, బహుభార్యత్వాన్ని తిరస్కరించాడు. తను క్షత్రియుడు. క్షత్రియులు బహుభార్యత్వానికి అర్హులు. రాములవారి దృష్టిలో అది ధర్మం కాదు. ఆదర్శం కాదు. స్త్రీ ఒక పురుషుడికి సర్వాత్మనా అంకితమైనట్టే పురుషుడు కూడా సర్వాత్మనా తన స్త్రీకి అంకితమైపోవాలన్న సామాజికమైన ధర్మాన్ని ఆచరణలో చూపించాడు ఆయన. తాను అవతరించిన మానవ జాతి ఆదర్శ దాంపత్య ధర్మాన్ని పాటించాలన్న ఉదాత్త ఆశయం ఆయనది.
 
శ్రీరామపత్ని సీతమ్మ సతీ ధర్మం గురించి తెలియని వాళ్లుండరు. ‘భారత స్త్రీకి వివాహం అయ్యేదాకా భగవంతుడే భర్త. వివాహం అయ్యాక భర్తే భగవంతుడు’ అన్నారు ధర్మ కోవిదులు. రావణాసురుడికి గడ్డిపరక అడ్డుపెట్టి మాట్లాడి, పరపరుషుడిని తిరస్కరిస్తే, ఇటు ఆమె భర్త సౌందర్యానికి ప్రతిరూపంగా రూపం మార్చుకుని వచ్చిన శూర్పణఖను తిరస్కరించాడు.
 
సీతాదేవి పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికి అగ్నిపరీక్ష పెట్టాడు రాముడు. రాముడికి తన పాతివ్రత్యం మీద ఉన్న అచంచల విశ్వాసాన్ని లోకానికి కళ్లకు కట్టడానికి అగ్నిప్రవేశం చేసిన మహా మహిళ సీతమ్మ. రాముడికి సీత ప్రాణం. సీతకు రాముడు ప్రాణం. ఒకరు సముద్రం. ఒకరు కెరటం. ఒకరు పుష్పం. ఒకరు సౌరభం. ఒకరు జ్యోతి. ఒకరు కాంతి. సీతారాములు ఒకరికొకరు ఆదర్శం. సీతారాముల దాంపత్యం మానవ దంపతులకు ఆదర్శం. పురుషుడు శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా, స్త్రీ సీతాసాధ్విని ఆదర్శంగా స్వీకరించడం శ్రేయోదాయకం.
 
రామయ్య సీతమ్మను స్వయంవరంలో గెలిచి వివాహం చేసుకున్నాడు. అన్నంత మాత్రాన ప్రేమ వివాహమో మరే ఇతర పద్ధతో కాదు. విశ్వామిత్రుని ఆదేశం ప్రకారమే శివధనుర్భంగం చేశాడు. ఆ తర్వాత కూడా తండ్రి అయిన దశరథుని ఆజ్ఞ అయితే సీతమ్మను స్వీకరించాడు. అంటే రామయ్యది పెద్దలు కుదిర్చిన వివాహమే. అలాగని, సీతమ్మను బలవంతాన ఇష్టపడలేదు.

ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి
గుణాద్రూప గుణాచ్ఛాపి ప్రీతిః భూయోభి వర్థత ॥
 
పెద్దలు కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కలిగేలా చేసుకుందట. ఇదీ ఆదర్శ దాంపత్యానికి ఉండాల్సిన లక్షణం. అందుకే యుగాలు గడిచినా సీతారాముల దాంపత్యం నేటికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.  అంతకు ముందురోజున రామా! రేపే పట్టాభిషేకం, అందుకు తగిన నియమాలతో సిద్ధంగా ఉండమన్నారు పెద్దలు, కులగురువులు. ఆయన ఆ ఏర్పాట్లలో ఉండగానే పట్టాభిషేకం లేదు సరికదా... పద్నాలుగేళ్లపాటు అడవులకు వెళ్లాలని అన్నారు. రాముడు సరే అన్నాడు. సీతమ్మ కూడా ఏమాత్రం నిరుత్సాహ పడలేదు. భర్తను వెనక్కు లాగలేదు. రాముడు మాత్రం తండ్రి తనను ఒక్కడినే కదా అడవులకు వెళ్లమన్నది... క్రూరమృగాలు, విషసర్పాలు సంచరించే అడవులకు అతి సుకుమారి, సుందర కోమలాంగీ, ఎండ కన్నెరుగని రాజకుమారి అయిన సీత తనతోబాటు ఎందుకు కష్టాలు పడాలి... ఆమె అయోధ్యలోనే ఉండి, రాణివాస స్త్రీగా భోగాలనుభవించవచ్చు లేదా పుట్టింటిలో హాయిగా కాలక్షేపం చేయవచ్చు అనుకున్నాడు. అదే మాట  ఆమెతో చెప్పాడు. కానీ సీత అందుకు అంగీకరించలేదు. భర్త సామీప్యం లేని సిరిసంపదలు తనకు అక్కరలేదంది. భర్తను వెన్నంటి ఉండటమే భాగ్యం అనుకుంది.  సంసారాన్ని ఈదడానికి నేనొక్కడినే కష్టపడుతున్నాను, భార్య హాయిగా ఇంట్లో తిని కూర్చుంటోంది అని వాపోయే నేటికాలపు పురుషులు ఈ విషయంలో రాముడి నుంచి నేర్చుకోవాలి. అలాగే అత్తగారికి, తనకు లేదా మామగారికి తనకు మధ్య ఏవైనా గొడవలు వచ్చినప్పుడు భర్త తన తరఫున మాట్లాడకుండా వారిని వెనకేసుకుని వచ్చినందుకు మూతివిరిచే భార్యలకు సీతమ్మ వారు ఆదర్శం కాదా!
 
అశోకవనంలో ఉన్న సీత మ్మతో హనుమంతుడు తన భుజంపై కూర్చోబెట్టుకుని రాముని వద్దకు చేరుస్తానంటాడు. అప్పుడు సీతమ్మ- హనుమా! నీవు ఉత్తముడివే. కానీ పురుషుణ్ణి తాకన నే నియమం కలదాన్ని. అదేకాదు, నీవు నన్ను తీసుకొని వెళ్లిపోతే, తన భార్యను వేరే వారెవరో ఎత్తుకుని వెళితే, మరొకరితో ఆమెను తన వద్దకు తెప్పించుకున్నాడు పిరికివాడైన రాముడు అని నా నాథుణ్ణి లోకులు ఎగతాళి చేయరా? అదీగాక నాలాగే ఈ దుష్టుడి చెరలో ఉన్న ఇతర స్త్రీలకు కూడా విముక్తి లభించాలి కదా! అందుకే నా రాముణ్ణే రానివ్వు... ఆయన శూరత్వాన్ని లోకానికి చాటనివ్వు-  అంటుంది సీతమ్మ. అది చాలదా? సీతమ్మకు తన భర్త వీరత్వం మీద ఎంత నమ్మకమున్నదో తెలుసుకోవడానికి!

No comments:

Post a Comment