Tuesday, June 14, 2016

తప్పడు ప్రమాణాలు చేస్తే వెంటనే శిక్షించే సిద్ది వినాయకుడు..

అడ్డంకులను, ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలు బాగుండాలని దీవించే దేవుడు విఘ్నేశ్వరుడు. సర్వ విఘ్నాలను నివారించే దేవుడు వినాయకుడు. హిందూ దేవుళ్ళలో ఎందరు దేవుళ్ళు ఉన్నా సరే మొదటి పూజలు మాత్రం ఆ గణనాధుడికే. పూర్వీకుల కాలం నుండి నేటివరకూ ప్రపంచదేశాలలో భక్తులచే విశేష పూజలందుకుంటూ కోరిన వరాలు తీర్చే బొజ్జ గణపయ్యగా ఆయన చాలా ఫేమస్. అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభు గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 


వక్రతుండిగా, లంబోధరుడిగా, గజాననుడు, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ముద్దల తనయుడు, మన రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకంలో కొలువుదీరాడు. అయితే చిత్తూరు జిల్లాలోని స్వయంభు గణపతిగా వెలసిన కాణిపాక వరసిద్ధి వినాయకుడి క్షేత్రానికి చాలా చారిత్రక ప్రాముఖ్యత ఉంది మరి ఆ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం..

కాణిపాక వరసిద్ది వినాయక స్ధలపురాణం: 



ప్రస్తుతం కాణిపాకంగా మనం అంతా పిలుస్తున్న ఆ ఊరు పూర్వ కాలంలో ‘విహారపురి'. ఈ గ్రామంలో ధర్మాచరణ పరాయుణులైన ముగ్గురు వికలాంగ సోదరులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. పూర్వజన్మ కర్మఫలంగా వారు గుడ్డి, మూగ, చెవిటి వారిగా జన్మించారు. వారి కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్న భూమిని సాగు చేసుకొంటూ జీవనం సాగించేవారు.



ఈ క్రమంలో ఒక సారి ఆగ్రామం కరవుకాటకాలతో అల్లాడి పోయింది. పంటలపొలాలకు మాత్రమే కాదు, కనీసం గ్రామస్తులకు తాగడానికి నీరు సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరవును జయించడానికి ముగ్గురు సోదరులు తమ పొలంలోని బావిని లోతు చేయడానికి పూనుకొన్నారు. వీరు బావిని తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. దీనిని తొలగించడానికి ప్రయత్నించారు.

ఈ ప్రయత్నంలో చేతిలోని గడ్డపార, గుణపాల సహాయంతో రాయినితొలగిస్తుండగా చేతిలోని పార పెద్ద బండ రాయికి తగిలి వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మింది. ఈ రక్తం అంగవైకల్య సోదరులను తాకింది. దీంతో వీరికి ఉన్న అంగవైకల్యం తొలగిపోయాయి.



గ్రామాన్ని పాలిస్తున్న రాజుకు, ఆ ముగ్గురు వికలాంగ సోదరులు వివరించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న గ్రామస్థులు బావిని పూర్తిగా మరింత లోతుగా తవ్వి పరిశీలించారు. ఆ బావిలో ‘గణనాథుని' రూపం కనిపించింది. తెలియకు చేసిన తప్పుకు క్షమించమని ఆ ప్రజలు వేడుకున్నారు. స్వయంభుగా వెలసిన ఆ గణనాథుడికి గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పూజించి స్వామివారికి కొబ్బరి కాయలను సమర్పించారు.



కొబ్బరి కాయల సమర్పణతో ‘కాణి' భూమి(కాణి అంటే ఎకరం పొలం అని అర్థం, పాకరం అంటే నీరు ప్రవహించడం) పారింది. దీంతో ‘విహారపురి' గ్రామానికి ‘కాణిపారకరమ్‌' అన్న పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాస్తా ‘కాణిపాకం'గామారింది.

తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ది,బుద్దులను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీకాణిపాకం వినాయకుడు.కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది. స్వామివారు ఇక్కడ బావిలో స్వయంభూగా వెలిసాడు. ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది.



ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది. అదే నీటిని భక్తుల తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు.

ఈ భావిలో స్వామి వారి వాహనము ఎలుక వున్నది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్ధం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి..



స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది. 

వరసిద్ధుడు ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి కెక్కారు. స్వామివారి ఎదుట తప్పుడు ప్రమాణం చేస్తే శిక్షిస్తారని ఇక్కడికి దర్శనానికి వచ్చే భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతే కాకుండా వ్యసనాలకు బానిసలైన వారు స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని నమ్మకం. స్వామివారి ఎదుట సాధారణ ప్రమాణాలే కాకుండా రాజకీయ ప్రమాణాలు సైతం చేయడం విశేషం.

ఎందరో వ్యక్తిగత దురవ్యసనాల నుంచి విముక్తి పొందడానికి ఈ క్షెత్రం దారి చూపుతోంది. ఇక్కడ సప్రమాణం చేస్తే దానికి కట్టుబడి ఉంటారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. తాగుడు, జూదం వివాహేతర సంబందాలు, దొంగతనాలు వంటి వ్యసనాలుకు గురైన వారిని కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకువచ్చి ప్రమాణం చేయిస్తుంటారు. మత తప్పితే అశుభం జరుగుతుందనే భయంతో చాలామంది ప్రమాణాలకు కట్టుబడి మంచిగా మారుతుంటారు.

వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం, 2002 సంవత్సరంలో భక్తులు విరాళంగా స్వామివారికి సమర్పించిన వెండి కవచం సైతం సరిపోవడం లేదు.

స్వామివారిని దర్శించుకునే భక్తులకు అర్చకులు నీటిని చేయి పెట్టి తోడి మారి చూపిస్తుంటారు. ఈ నిదర్శనలకు తోడూ స్వామివారు స్వయంభువు అని చెప్పడానికి మరిన్ని ఆధారాలు సజీవంగా కనిపిస్తున్నాయి.

దానితరువాత పలువురు భక్తులు కవచాలు చేయించారు. అవికూడా తర్వాత స్వామివారికి సరిపోవడంలేదు. ఇలా ఎప్పటికప్పుడు స్వామివారి మూలవిరాట్టు పెరుగుతూ పోతున్నందున ఆ కవచాలు ఇప్పుడు మూషిక మండపంలో భక్తుల ప్రదర్శనకు మాత్రమే వినియోగిస్తున్నారు.

No comments:

Post a Comment