Monday, May 9, 2016

అక్షయ తదియ రోజు చేయాల్సింది ఏమిటి..మనం చేస్తున్నది ఏమిటి..!

అక్షయతృతీయ వైశాఖ మాసంలో శుక్షపక్షంలో మూడవ రోజు వస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా మహిళలకు చాలా ఇష్టం. ఈ రోజున సిరి సంపదలను ప్రసాధించే శ్రీ మహాలక్ష్మీ దేవిని అందరూ భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఈ రోజు అక్షయ తృతియ పర్వదినం. ఈ రోజు అక్షయతృతీయను పసిడిరాసుల పర్వదినంగా భావిస్తారు. చాలా మంది ఈ రోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అక్షయం అంటే తరిగిపోనిది అని అర్ధం. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువుతీరుతుందని చాలా మంది విశ్వాసం.

ఈ అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చింది? ఈ పండుగ యొక్క ప్రాధాన్యత ఏంటి...


అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా? దానం చేయాలా?

1. బంగారం భూలోకంలో మొదటిసారి గండకీనదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ద తదియనాడు ఉద్భవించింది. అందుకే ఈరోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అయితే బంగారంకు పండగ ఏమిటని చాలా మందికి సందేహం రావచ్చు. బంగారం అనేది సాధారణ లోహం కాదు. అది దేవలోహం. బంగారానికి ‘హిరణ్మయి'అనే మరో పేరు కూడా ఉంది.


2. ‘హిరణ్య గర్భో భూగర్బో మాధవో మధుసూదన:' అని విష్ణు సహస్రనామం చెబుతుంది. ‘విష్ణువు' హిరణ్యగర్భుడు. అంటే ‘గర్భం నుందు బంగారం కలిగిన వాడని' అర్థం. బంగారం విష్ణువుకు ప్రతి రూపం. అందుకే బంగారం పూజనీయమైనది. దీని జన్మదినమైన అక్షతృతీయ అందరికీ పండుగే మరి!



3. అక్షయ అంటే.. తరిగిపోకుండా, క్షీణించకుండా శాశ్వతంగా వుండేది. అందువల్లే ఈరోజు ప్రతిఒక్కరు ఆభరణాలు, స్థలాలు, గృహాలు నిర్మించుకోవడం చేస్తారు. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే.. ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే.. అక్షయ తృతీయరోజు దీనిని కొనడం వల్ల అదృష్టం కలిసివస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.



మరి ఈ పర్వదినం రోజున ఏం చేయాలి? 

4. ఈ రోజు అక్షయ తృతీయ పసిడిరాసుల పర్వదినం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. పూజా మందిరాన్ని అలంకరించుకుని ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణెలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు పరచి పసుపు వినాయకుడని ప్రతిష్టించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షింతలతో పూజించిన అనంతరం ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలనూ, బంగారాన్నీ కలశం ముందు పెట్టి చెంకరపొంగలితో నైవేద్యం పెట్టాలి. లక్ష్మీదేవి స్తోత్రం చేయడం మంచిది. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యధాశక్తి పూజించడం వలన సకల సౌభాగ్యాలూ సమకూరుతాయి. చాలా మంది ఈ రోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి, వసుదేవున్ని పూజిస్తారు.



5. మరి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలా? లేదా దానం చేయాలా? అక్షయతృతీయ రోజున కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలనీ, అలా కొన్న వారింట బంగారం అక్షయంగా వృద్ది చెందుతుందనీ చాలా మంది నమ్మకం. ఇందులో కొంత వరకూ నిజం ఉంది. ఈ రోజు కొద్ది మొత్తంలో అయినా బంగారాన్ని కొని, దాన్ని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి యథాశక్తి పూజించిన అనంతరం ఒక బ్రాహ్ముణుడికి దానం ఇవ్వాలని అంటారు. ఆ దానం వల్ల దానం చేసే వారి ఇంట్లో బంగారం అక్షయమవుతుందని అంటారు. చాలా మంది బంగారం కొని పూజించడం మాత్రమే చేస్తారు తప్ప దానం గురించి పట్టించుకోరు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెబుతారు.



6. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంథం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రలలోకానీ, రాగి పాత్రలలో కాని నీళ్లు పోసి దానిలో తులసి దళాలుకానీ, మారేడుదళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్లు అవుతాయని శాస్ర్తాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి.



7. అక్షయ తృతీయ రోజున ఎలాంటి పనులు చేపట్టవచ్చు? అటువంటి పవిత్ర పర్వదినమైన "అక్షయ తృతీయ" ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు.



8. ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టవచ్చును. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.



9. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.

10. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి.

11. పురాణాల్లో ఈ రోజు విశిష్టత వేదవ్యాసుడు ఈరోజు మహా భారతాన్ని ఏకబిగిన విఘ్నేశ్వరుడికి చెప్పడం ప్రారంభించగా ఆయన మహా భారతాన్ని రాయడం మెదలు పెట్టాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు అక్షయ పాత్రను బహుకరించాడు. మహాభారతంలో ద్రౌపది వస్ర్తాపహరణం జరిగినది అక్షయ తృతీయ రోజే. ఆ సమయంలో ద్రౌపది శ్రీ కృష్ణుడిని ప్రార్థింంచగా చివరలేని చీరలను అలా ప్రసాదించి ద్రౌపది మానాన్ని రక్షించాడు. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడు అయ్యాడు.

12. అత్యంత ప్రముఖమైన పురాణ గాథ శ్రీ కృష్ణుడు సుదాముని కథలో బాల్య స్నేహితుడు సుదాముడు పేదరికం అనుభవించే రోజుల్లో అక్షయ తృతీయ నాడే ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడిని సహాయం కోరుతాడు.

No comments:

Post a Comment