Saturday, January 30, 2016

‘గ్రాండ్’ హ్యాట్రిక్...

సానియా-హింగిస్ జంటకే మహిళల డబుల్స్ టైటిల్
వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ

మెల్‌బోర్న్: ఊహించిన ఫలితమే వచ్చింది. కొంతకాలంగా మహిళల డబుల్స్ టెన్నిస్‌ను శాసిస్తోన్న సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట తమ ఖాతాలో వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జమ చేసుకుంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్‌ను నెగ్గిన ఈ ద్వయం ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ అజేయంగా నిలిచింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకొని గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ‘హ్యాట్రిక్’ సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 7-6 (7/1), 6-3తో ఏడో సీడ్ ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జంటను ఓడించి చాంపియన్‌గా అవతరించింది.



గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా జంటకు తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే లభించింది. రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. దాంతో  తొలి సెట్‌లో ఏకంగా ఎనిమిది సార్లు సర్వీస్‌లు బ్రేక్ అయ్యాయి. తుదకు టైబ్రేక్‌లో సానియా జంట పైచేయి సాధించి తొలి సెట్‌ను 62 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్ ఆరంభంలోనే హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సానియా-హింగిస్ జంట తర్వాత అదే జోరును కొనసాగించి 5-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఎనిమిదో గేమ్‌లో హింగిస్ తన సర్వీస్‌ను కోల్పోయినా... తొమ్మిదో గేమ్‌లో హర్డెకా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ ద్వయం విజయాన్ని దక్కించుకుంది.
 
విజేతగా నిలిచిన సానియా-హింగిస్ జంటకు 6,35,000 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 5 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 2000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. బహుమతి ప్రదానోత్సవంలో ఇద్దరికీ కలిపి ఒకే ట్రోఫీ అందజేస్తారు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేందుకు ఇద్దరికీ వేర్వేరుగా ఒక్కో ట్రోఫీని ఇస్తారు.
 
మిక్స్‌డ్ డబుల్స్‌లో నిరాశ: మహిళల డబుల్స్‌లో టైటిల్  నెగ్గిన సానియా మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం సెమీఫైనల్లో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా-ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జంట 5-7, 6-7 (4/7)తో ఐదో సీడ్ ఎలీనా వెస్నినా (రష్యా)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. సెమీస్‌లో ఓడిన సానియా జంటకు 39,250 ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 18 లక్షల 90 వేలు)ప్రైజ్‌మనీ దక్కింది.
 
36 వరుసగా సానియా-హింగిస్ సాధించిన విజయాలు.
ఈ ఇండో-స్విస్ జంట ఖాతాలో చేరిన వరుస టైటిల్స్ సంఖ్య.
6 మిక్స్‌డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌ను కలిపి సానియా సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.
21 సింగిల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాలలో కలిపి హింగిస్  నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.

No comments:

Post a Comment