Thursday, June 2, 2016

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకు అంటారో తెలుసా

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని చెప్తారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు.



మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు.



మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ''అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను'' అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో'' అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది...



అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?


  • మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.

  • మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని. దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
  • దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: | దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ||
  • బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

  • మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.
  • అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తీసుకునేటప్పుడు నిందింపకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. ఎంగిలి ఎవరికీ పెట్టకూడదు. అమిత భోజనం ఆరోగ్యభంగాన్ని కలిగిస్తుంది.

  • ఎంగిలి చేత్తో బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని తాకరాదు. తలకు గుడ్డచుట్టుకుని, చెప్పులు, బూట్లు వేసుకుని భుజించరాదు. దక్షిణం వైపు తిరిగి భుజించకూడదు. తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. మంచంపైన కూర్చుని ఏవీ తినకూడదు. ఏ వస్తువునైనా ఒడిలో పెట్టుకుని తినరాదు.
  • భోజనం ఆకుల్లో పెట్టడమే మంచిది. అది ఆరోగ్యప్రదం. ప్లేట్లు ఉపయోగించడం వల్ల జబ్బులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రాతస్సాయం సంధ్యా సమయాల్లో చేసే ఉపాసన సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి "న సంధ్యయోర్నమధ్యాహ్నే నార్థరాత్రే కదాచన" సంధిసమయాల్లో, అర్థరాత్రిలో భుజింపరాదు. అర్థరాత్రి సూర్యసంబంధం బొత్తిగా లేనందున ఆకలి మందగించి ఉంటుంది. కాబట్టి అర్థరాత్రి భోజనం నిషేధమని పండితులు అంటున్నారు.

  • నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు.
  • అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. 
  • ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి.
  • బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు.
  • భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.


No comments:

Post a Comment