Tuesday, March 8, 2016

మహిళ మేలుకుంది... హక్కుల్ని సాధించింది


అంతర్జాతీయ మహిళా దినోత్సవం.... ఒక్క మనమే కాదు... ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయంగా, వ్యాపారపరంగా, అధికారపరంగా ఎదిగిన తమ జాతి ఉన్నతిని చూసి ఉప్పొంగుతున్నారు. అసలు మహిళా దినోత్సవం ఎలా వచ్చింది...? ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు... మరి ఒకప్పుడు... కేవలం ఇంటిపనులకే పరిమితం. ముఖం మీద మూసిన కొంగు బయట ఎత్తకూడదు. ఇక పాశ్చాత్య దేశాల్లో చాలా చిన్నస్థాయి ఉద్యోగాలకే మహిళలు అర్హులు. అయినా వారికిచ్చే రోజూవారి కూలీ మగవాళ్లతో పోలిస్తే చాలా తక్కువ. ఇలా ప్రతి విషయంలోనూ అణగారి పోయిన వారి మనసుపొరల్లోంచి ఉబికిన విప్లవమే... మహిళా దినోత్సవంగా మారింది. మహిళల్లో పంటిబిగువున బాధల్ని నొక్కిపట్టేవారే కాదు... తమ సమస్య ఇది బయటికి చెబుతూ ఉద్యమాలు చేసే నాయకురాళ్లు ఉన్నారు. అలాంటి వారి చలవే ఈ మహిళా దినోత్సవం. చరిత్రలో చూస్తే ప్రత్యేకంగా ఒకరి వల్ల మహిళా దినోత్సవం వచ్చిందని లేదు. వివిధ దేశాల్లో అనేక మంది మహిళలు చేసిన ఉద్యమాల ఫలితంగా ఆడవాళ్లకి ఓ దినోత్సవం ఏర్పడినట్టు తెలుస్తోంది. 

మొదటగా 1910లో ఇద్దరు జర్మన్ సామ్యవాదుల వల్ల అంతర్జాతీయ మహిళాదినోత్సవం అనే పేరు బయటికి వచ్చింది. దాదాపు 17 దేశాలకు చెందిన వందమంది మహిళలు ఆ ఏడాది ఒక్కచోట చేరారు. కాలరాస్తున్న హక్కుల గురించి చర్చించుకున్నారు. ఓటు హక్కుతో పాటూ, మగవాళ్లతో అన్నింట్లోనూ సమాన హక్కులు సాధించాలని ఆ వందమహిళలు అనుకున్నారు. ఆ మరుసటి ఏడాది మళ్లీ సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి ఊహించని రీతిగా ఏకంగా పదిలక్షల మంది మహిళలు వచ్చారు. మహిళల పోరాటం ఊపందుకుంది. 1913లో రష్యన్ మహిళలు మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం చేసుకున్నారు. జర్మనీలో 1914లో చేసుకున్న మహిళదినోత్సవాన్ని మహిళల ఓటుహక్కుకోసం అంకితమిచ్చారు. అయితే, వారికి ఓటుహక్కు మాత్రం 1918లో వచ్చింది. నిజానికి మార్చి 8న ప్రస్తుతం మహిళా దినోత్సవం చేసుకుంటున్నా... ఆ రోజున మాత్రం ఎలాంటి విప్లవాలు, ఉద్యమాలు జరుగలేదు. 

1917లో అమెరికాలోని ఫ్లోరిడాలో మహిళా విప్లవమే లేచింది. ఆ ఏడాది ఫిబ్రవరిలో చివరి ఆదివారం మహిళాదినోత్సవం చేసుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యాల తదితర దేశాల్లో ఏర్పడిన ఆహారకొరత ముగిసిపోవాలని నినాదాలు చేశారు. అనంతరం అదే ఏడాది అక్టోబర్ లో రష్యాలోనూ ఉద్యమాలు చేశారు మహిళలు. మహిళా దినోత్సవం రోజును దేశంలో సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. చివరికి 1965 నుంచి రష్యాలో మహిళా దినోత్సవం అంతర్జాతీయ సెలవుదినంగా మారింది. 1922లో చైనా, 1936లో స్పెయిన్ లో మహిళాదినోత్సవం అధికారికంగా చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాలో1949 నుంచి మార్చి ఎనిమిది నుంచి మహిళలకు సగం సెలవు ను ప్రభుత్వం ఇచ్చింది. 1977లో మార్చి8ని అధికారికంగా మహిళదినోత్సవంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతిపాదించింది.

No comments:

Post a Comment