Wednesday, March 9, 2016

వీక్ అండ్స్ సమయంలో ఉయ్యాలలో సేద తీరండి

ఉయ్యాలూగడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పుడైతే ఈ ముచ్చట తీర్చుకోవడానికి వాకిట్లోని చెట్టుకు లేదంటే ఇంట్లోనే తాడు లేదా చీర సహాయంతో ఉయ్యాల వేలాడడీయించుకుని మరీ ఊగే వాళ్లం. ఇప్పటికీ అప్పుడప్పుడు పార్కులకు వెళ్లినప్పుడు కూడా మనలో చాలా మంది ఉయ్యాలలూగడానికి ఆసక్తి చూపుతుంటారు. 


అయితే ప్రస్తుతం ఉయ్యాలలూగడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అవే మన ముంగిట్లోకి వచ్చి వాలుతున్నాయి. వినియోగదారులకు అభిరుచుల్ని, సౌకర్యాన్ని బట్టి, ఇప్పుడు ఎన్నో రకాల ఉయ్యాలలు ఫర్నిచర్ షాపుల్లో కొలువుతీరాయి. ఇవి కేవలం మన సరదా తీర్చుకోవడానికే కాదు... ఇంటి ముంగిలికే కొత్త సొగసులను తీసుకొస్తున్నాయి . మరి అలాంటి కొన్ని రకాలా ఉయ్యాలల గురించి తెలుసుకుందాం...


సేదతీరేలా: కొన్ని ఉయ్యాలలు కేవలం కూర్చోవడానికి మాత్రమే కాదు..వెనక్కి జారగిలబడి కూర్చుని సేదతీరేందుకు వీలుగా ఉంటున్నాయి. ఇందులో భాగంగా కూర్చునే సీటుకు చివరి భాగంలో కాస్త వంపుగా ఉంటుంది. దీంతో మోకాలి వెనక భాగంలో సౌకర్యంగా ఉండి, నొప్పి రాకుండా ఉంటుంది. అలాగే ఉయ్యాలలో ఒరగడానికి వీలుగా ఉండే భాగం కాస్త ఎత్తుగా ఉండి, చివరికి వచ్చే సరికి వంపు తిరిగి ఉంటుంది. ఇలా ఉండటం వల్ల దానిపై తల ఆనించి హాయిగా కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే ఈ ఉయ్యాలకు మధ్యమధ్యలో ఎక్కడా పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండవు కాబట్టి పిల్లలు ఎక్కినా వాటి నుంచి జారి కింద పడకుండా ఉంటుంది.

సౌకర్యంగా: ఒకప్పుడు ఉయ్యాలంటే ఒక బల్ల మాదిరగా ఉండి..దానికి నాలుగు వైపులా గొలుసులతో పైనుంచి వేలాడదీసేవారు. వీటిలో ఒరిగి కూర్చునే వీలుండేది కాదు. కాసేపు ఊగడానికి లేదంటే పుడకోవడానికి మాత్రమే ఉపయుక్తంగా ఉండేవి. ఒక వేళ వీటిలో ఎక్కువ సేపు కూర్చున్నా...నడుంనొప్పి వచ్చేది. కాబట్టి ఇవన్నీ ద్రుష్టిలో ఉంచుకుని ప్రస్తుతం వీటి తయారీలో చాలానే మార్పులు చేశారు. ఇప్పుడున్న ఉయ్యాలల్లో బల్లతో పాటు వెనకవైపు ఒరిగి కూర్చోవడానికి వీలుగా రెండు పక్కలకు రెండు హ్యాండిల్స్ ఉండేలా తయారుచేస్తున్నారు. దీంతో ఈ రకం ఉయ్యాలలు మరింత సౌకర్యవంతంగా ఉంటున్నాయి. అలాగే ఈ ఉయ్యాలలు పరిమాణాన్ని బట్టి వీటిలో ముగ్గురు లేదా నలుగురు కూర్చోవడానికి వీలుగా ఉంటుంది.

భోజనం కూడా: ఉయ్యాలూగుతుంటేనే ఎంతో సరదాగా ఉంటుంది. మరి దానిపై కూర్చుని మనకిష్టమైనంది తింటుంటే ..మరెంతో సంతోషంగా అనిపిస్తుంది కదా..! ఇందుకోసం అనువుగా ఉండే ఉయ్యాలు కూడా మార్కెట్లో చాలానే అభిస్తున్నాయి. ఇవి మామూలు ఉయ్యాలల్లాగే ఉంటూ మధ్యలో చిన్న కుర్చీల మాదిరిగా ఎత్తుగా ఉంటుంది. దీనిపై తయారుచేసుకున్న వంటకాల్ని అమర్చుకొని ..రెండువైపులా ఇద్దరూ కూర్చొని ఊగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినవచ్చు.

ఒక్కరికోసం : ఒక్కరే ఊగేందుకు వీలుగా ఉండే ఉయ్యాలలు కూడా చాలానే లభిస్తున్నాయి. ఈ క్రమంలో సాధారణం కుర్చీ మాదిరిగా ఉండేవి కొన్నైతే, కేన్ తో తయారుచేసినవి మరికొన్ని...అలాగే ఇంకొన్ని ఉయ్యాలలైతే పైకప్పు నుంచి వేలాడదీయకుండా, స్వయంగా వేలాడేలా ఉయ్యాలకే స్వింగ్ స్టాండ్ అమరిక ఉంటుంది. అలాంటి వాటికి ఎక్కడికంటే అక్కడికి సులభంగా తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుంది.

హాయిగా పడుకోవడానికి : కేవలం కూర్చోవడానికే కాదు..మంచి మీద పడుకున్నట్టుగా ఉండే ఉయ్యాలలూ ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీటిపై పడుకుని హాయిగా నిద్రపోవచ్చు. పైగా వీటిని ముంగిట్లోనే కాకుండా లాన్ లో కూడా అమర్చుకోవచ్చు. తద్వారా బయట చల్లగాలికి కాసేపు రిలాక్స్ అయినట్లుగా ఉంటుంది. అలాగే ఇలాంటి ఉయ్యాలల్ని కొంతమంది హాల్లో కూడా వేలాడదీస్తారు. తద్వారా అందులో పడుకుని టీవీ చూడడమో లేదంటే కాసేపు పాటలు వినడమో చేయవచ్చు. ఈ ఉయ్యాలల్లో పడుకోవడంతో పాటు వెనక్కి ఒరిగి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది.

వివిధ మెటీరియళ్లతో: ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకరకాల ఉయ్యాలన్ని కేవలం చెక్కతోనే కాకుండా ఫ్యాబ్రిక్, కేన్ ...వంటి పలు రకాల మెటీరియళ్లతో తయారుచేస్తున్నారు. అయితే ఇవి దేంతో తయారైనా సరే..కూర్చోవడానికి సౌకర్యవంతంగా ఉండాలంటే వాటిపై సోఫాసెట్ మాదిరిగా మెత్తటి కుషన్స్ అమర్చితే చూడటానికి కూడా ఆకర్షనీయంగా కనిపిస్తుంది.

ఇంటి అందాన్ని..మానసిక ఉల్లాసాన్ని పెంచే గ్లామరస్ స్వింగ్ సెట్స్ ఇంటిలోగిళ్లలో అందాన్నిచ్చే ఇలాంటి ఉయ్యాలలు మరెన్నో మార్కెట్టో అందుబాటులో ఉన్నాయి. మరి మీకూ వీటిని తెచ్చుకోవాలనిపిస్తుందా? అయితే వెంటనే మీకు నచ్చిన ఉయ్యాలను ఇంటికి తెచ్చేసుకుని మీ ఇంటికి కొత్త కళ తీసుకురండి..

No comments:

Post a Comment