Monday, February 22, 2016

ఆధ్యాత్మిక జీవనసూత్రాలు

కేనోపనిషత్తు
దశోపనిషత్తులలో ప్రముఖమైనది కఠోపనిషత్తు. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని, జీవన విధానాన్ని, పరిశీలనా దృష్టిని ఆసక్తికరంగా చెప్పే కఠోపనిషత్తు ఉపనిషత్తులకు తలమానికం. ఉత్తిష్ఠత/ జాగ్రత/ ప్రాప్యవరాన్నిబోధత/ క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదంతి.(1-3-14)
 (లేవండి. మెలకువ పొందండి. శ్రేష్ఠులైన గురువుల వద్దకు వెళ్లి ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఇది పదునైన కత్తి అంచుమీద నడకలాగా కష్టమైనది)

 స్వామి వివేకానంద ప్రపంచ మానవులందరికీ ఇచ్చిన ఈ సందేశం కఠోపనిషత్తులోనిదే. ప్రబోధాత్మకమైన ఈ ఉపనిషత్తు ఆయనకు చాలా ఇష్టం. కఠోపనిషత్తు రెండు అధ్యాయాలు ఒక్కొక్కదాంట్లో మూడు వల్లులు, మొత్తం నూట పందొమ్మిది మంత్రాలు. పిల్లలు, పెద్దలు అందరూ చదవ వలసిన సందేశాత్మకమైన ఉపనిషత్తు ఇది. నాటకీయత తో ఆకర్షణీయమైన కథతో భౌతిక ఆధ్యాత్మిక జీవన సూత్రాలను అరటిపండు ఒలిచిపెట్టినట్లు చెప్పే కఠోపనిషత్తు సారాంశాన్ని చదండి.

 ప్రథమాధ్యాయం: ప్రథమ వల్లి
 వాజశ్రవసుడు అనే గృహస్థు ఒక మహాయజ్ఞాన్ని చేస్తూ తన సర్వస్వాన్ని దానం చేస్తున్నాడు. అతనికి నచికేతుడు అనే కొడుకు ఉన్నాడు. తన తండ్రి బ్రాహ్మణులకు దక్షిణగా ఇవ్వటానికి తెచ్చిన ఆవుల్ని ఆ పిల్లవాడు చూశాడు. అవి చాలా ముసలివి. నీళ్లు తాగలేవు. గడ్డి తినలేవు. పాలు ఇవ్వలేవు. శక్తిలేనివి. వట్టిపోయినవి. తండ్రి ఇటువంటి పనికిరాని ఆవుల్ని అశ్రద్ధగా పుణ్యంకోసం దానం చేయడం అతనికి బాధ కలిగించింది. ఇటువంటి దానాలు చేస్తే ఆనందలోకాలకు పోలేరు. మనం ఎదుటివారికి ఇచ్చేవి పనికి వచ్చేవి అయితే అది శ్రద్ధతో చేసిన దానం అవుతుంది. తండ్రి తప్పు చేస్తున్నాడు అనుకున్నాడు.

తండ్రి దగ్గరకు వెళ్లి ‘‘తండ్రీ! పుణ్యం కోసం నన్ను ఎవరికి దానం ఇవ్వబోతున్నావు?’’అని రెండుమూడుసార్లు వెంటపడి అడిగాడు. పిల్లవాడు అలా ఎందుకు అడుగుతున్నాడో గమనించని తండ్రికి విసుగు, కోపం వచ్చాయి. ‘‘నిన్ను మృత్యువుకి దానం చేస్తున్నాను’’ అన్నాడు. తండ్రి విసుగుతో అన్న మాటను ఆ పసివాడు నిజం అనుకున్నాడు. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే పెద్దలు కేకలేస్తారు. నేను బాగానే చదువుకుంటున్నాను కదా! సహాధ్యాయులు కొందరిలో మొదటివాణ్ణి. కొందరిలో మధ్యముణ్ణి. నేనెప్పుడూ చదువులో వెనకపడలేదు. మరి తండ్రి నన్ను యముడికి ఎందుకు ఇస్తానంటున్నాడు? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? రాలిపోయిన గింజలే మళ్లీ మొలకెత్తినట్లు మరణించిన మానవుడు మళ్లీ పుడతాడు. దీంట్లో బాధపడేది ఏముంది? అనుకుంటూ తండ్రి మాట ప్రకారం నచికేతుడు యమలోకానికి వెళ్లాడు. యముడు అక్కడలేడు. ఆయన కోసం ఎదురు చూస్తూ ఈ పిల్లవాడు యమధర్మరాజు ఇంటిముందు మూడురోజులు నిద్రాహారాలు లేకుండా గడిపాడు.

 అప్పుడు యముడు వచ్చాడు. రాగానే యమలోకపు పెద్దలు కొందరు ‘యమా! ఈ బ్రాహ్మణ బాలుడు నీ ఇంటికి అతిథిగా వచ్చాడు. మూడురోజుల నుంచి ఉపవాసం చేస్తున్నాడు. అతిథిని సంతృప్తి పరచడం మంచి గృహస్థుల ధర్మం. అతనికి కాళ్లు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి ఆహ్వానించు. ఏ ఇంట్లో అతిథి ఆహారం లేకుండా ఉంటాడో ఆ గృహస్థుని పుణ్యం, సిరిసంపదలు, పశువులు, సంతానం సమస్తం నశించిపోతాయి’’అన్నారు. యమునికి కూడా భయపడకుండా ధ ర్మాన్ని ఉపదేశించే పెద్దలు యమలోకంలో ఉన్నారంటే భూలోకంలో మనం ఎలా ఉండాలో కఠోపనిషత్తు సూచిస్తోంది.

 అప్పుడు యముడు నచికేతుడి దగ్గరకు వచ్చాడు. ‘బ్రహ్మచారీ! మా ఇంట్లో మూడురాత్రులు నిరాహారంగా ఉన్నావు. దానికి ప్రాయశ్చిత్తంగా నేను నీకు మూడువరాలు ఇస్తాను. ఏం కావాలో కోరుకో’ అన్నాడు.

 నచికేతుడు మృత్యుదేవా! నేను కోరే మొదటివరం నా తండ్రికి నాపై కోపం తగ్గాలి. శాంతసంకల్పుడు కావాలి. మంచి మనస్సుతో ఉండాలి. నువ్వు నన్ను తిప్పి పంపినందుకు సంతోషించాలి. దగ్గరకు తీసుకోవాలి’ అన్నాడు. తనను తిట్టినందుకు తండ్రి మీద కోపగించకుండా తండ్రికోపం తగ్గాలి అని కోరడంతో నచికేతుడు యువతరానికి ఆదర్శం అవుతున్నాడు. ‘తిరిగి వచ్చినందుకు సంతోషించాలి’ అనడంలో బుద్ధి చాతుర్యం ఉంది. ఒకసారి యమలోకానికి వచ్చినవాడు తిరిగి వెళ్లడం అరుదు. తెలివిగా యముణ్ణే బుట్టలో వేశాడు.

 యముడు నచికేతా! నీ తండ్రి నిన్ను ఆద రిస్తాడు. నీతో ప్రేమగా ఉంటాడు. యమలోకం నుంచి తిరిగి వచ్చిన నిన్ను చూసి హాయిగా నిద్రపోతాడు’అన్నాడు. పిల్లల్ని చేరదీసి వారికి ఏదన్నా జరిగితే పెద్దవాళ్లు నిద్రాహారాలు మాని ఎలా దుఃఖిస్తారో యముడు చెప్పకనే చెప్పాడు.

 నచికేతుడు యమధర్మరాజా! స్వర్గానికి చేరే యజ్ఞాన్ని గురించి నాకు వివరించు. నేను చాలా ఆసక్తితో శ్రద్ధతో ఉన్నాను. శ్రద్ధావంతుడు విద్యను ఉపదేశించవచ్చు. స్వర్గానికి చేరినవారు అమృతత్వాన్ని పొందుతారు కదా! ఇదే నా రెండోవరం!’ అన్నాడు.

1 comment: