Wednesday, August 10, 2016

ఆ గొంతు వినబడిందంటే.. ఎవరైనా ఆగిపోవాల్సిందే...!

హైదరాబాద్ :"ఆ రాత్రి సుప్రజ బార్ లో పీకల దాకా మద్యం సేవించిన రాకేష్.. నేరుగా సుప్రజ దగ్గరకు వెళ్లాడు. అక్కడే.. సరిగ్గా అక్కడే.. చూడకూడని దృశ్యం ఒకటి అతని కంటపడింది." 
'ఏంటా.. దృశ్యం?' 
అరగంట కార్యక్రమంలో చివరి నిముషం వరకు ఆ ఉత్యంఠను కొనసాగిస్తూ సాగే వ్యాఖ్యానమది. 20 సెకన్ల క్రైమ్ వార్తను భరించడమే కష్టమనుకునేవాళ్లను సైతం 30 నిముషాల క్రైమ్ బులెటిన్ ముందు నుంచి కదలకుండా చేసింది. 
ఒకవిధంగా.. క్రైమ్ టైమ్ ను కమ్యూనికేట్ చేయడంలో 'ఆల్ టైమ్ హిట్' ఆ గొంతు. 
రాత్రి ఎనిమిది.. ఎనిమిదిన్నర సమయంలో ఈటీవీ-2లో వచ్చే నేరాలు-ఘోరాలు ఎసిసోడ్స్ చూసినవాళ్లందరికీ.. సుపరిచితమైన గొంతు. ఎస్.. 'నూతన్ ప్రసాద్' వాయిస్ ఓవర్ చేసిన మ్యాజిక్ అది. ఆ పరంపరలో.. ప్రతీ ఛానెల్ ఓ క్రైమ్ బులెటిన్ ను రూపొందించుకుని.. ఆయా బులెటిన్లకు మరెన్నో గొంతులు జతకలిసినా..! క్రైమ్ న్యూస్ కు ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిన బూస్టింగ్ మరెవరి వల్ల కాలేదనే చెప్పాలి.

స్కేలు బద్ద పెట్టి కొలిచినట్లు.. పర్ఫెక్ట్ మెజర్ మెంట్ తో.. టీవీ తెర మీద కనిపిస్తున్న క్రైమ్ సీన్ ను రక్తి కట్టించడంలో ఆయన వ్యాఖ్యానికి మరేది సాటి రాదేమో! అందుకే.. కష్టంగా అరగంట పాటు నడిచే క్రైమ్ బులెటిన్ కాస్త.. ఆయన వ్యాఖ్యానం తోడవడంతో.. ఒకే క్రైమ్ న్యూస్ కూడా ఎసిసోడ్స్.. ఎపిసోడ్స్.. గా కొనసాగింది. 
విషయమేదైనా దాన్ని జనానికి కమ్యూనికేట్ చేయడంలో సఫలమయ్యేవారు కొందరే ఉంటారు. ఆ కొందరిలో.. అందరికంటే మిన్నగా కమ్యూనికేట్ చేసేవాళ్లు ఒక్కరో.. ఇద్దరో మాత్రమే ఉంటారు. అలా క్రైమ్ న్యూస్ ను కమ్యూనికేట్ చేయడంలో నూతన్ ప్రసాద్ అంతలా సక్సెస్ అయిన వారు ఇంకొకరు లేరు. 
ఒక్క మాటలో చెప్పాలంటే..! 

"నూతన్ ప్రసాద్ వాయిస్ ఓవర్ ఇప్పటి క్రైమ్ న్యూస్ యాంకర్స్ అందరికీ ఓ పారా మీటర్"

No comments:

Post a Comment