Thursday, July 7, 2016

రంజాన్ స్పెషల్


పండుగ రోజు నమాజు చేసిన  తర్వాత ఆలింగనం చేసుకోవడం సంప్రదాయం. అంటే... గుండెను గుండె తాకే సంప్రదాయం. ఆ పలకరింపు చాలా అందమైనది. గుండెతో గుండె మాట్లాడుకునేంత అందమైనది. ముస్లింభాయిలు మతాన్ని ఎంతగా ప్రేమిస్తారో... దేశాన్నీ అంతగా గౌరవిస్తారు.  మన సోదర భారతీయులు అల్లా మాటను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారు.  ప్రేమను పంచుతున్నారు. అవును, మన ముసల్మాన్ భాయ్‌లు నిజంగా దిల్‌మాన్ భాయ్‌లు!!
 
ఆ వైపు ఆరేళ్ల పాప... ఈ వైపు చిన్నారి వధువు ‘ఏయ్ ఆగండి’... అరిచింది నాజియా. వాళ్లు పట్టించుకోలేదు. అసలామె మాటే వినిపించు కోలేదు. ఆరుబయట ఆడుకుంటోన్న ఆరేళ్ల పాప నోరు మూసి, తమ బైకు మీద బలవంతంగా కూర్చోబెట్టుకున్నారు. ఆమెను ఎత్తుకుపోవాలని బండి స్టార్ట్ చేశారు. కానీ వారి బండి చక్రాలు ముందుకు కదల్లేదు. ఎందుకంటే వాటికి అడ్డంగా నాజియా నిలబడింది. ఉత్తరప్రదేశ్‌లోని సాఘిర్ ఫాతిమా మొహమ్మదియా బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని నాజియా. ఆరోజు కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఎవరో చిన్నారి ఆక్రందనలు వినిపించడంతో ఠక్కున ఆగింది. ఇద్దరు యువకులు ఓ ఆరేళ్ల పాపను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అది చూసిన నాజియా వెంటనే అక్కడికి పరుగుత్తింది. వాళ్లతో పెనుగులాడి, పాపను విడిపించి తీసుకుపోయింది. తల్లిదండ్రులకు అప్పగించి తిరిగి ఇంటికి బయలుదేరింది. దారిలో ఓ చోట పెళ్లి బాజాలు వినిపించాయి. దాంతో ఆమె దృష్టి అటువైపు మళ్లింది. ఆసక్తిగా అటువైపు నడిచింది. పెళ్లి పీటల మీద తన జూనియర్ డింపీని చూసి షాకయ్యింది. తొమ్మిదేళ్ల డింపీకి ఓ ముప్ఫై ఏళ్ల వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారామె తల్లిదండ్రులు. డింపీ కళ్లనీళ్లతో తలవంచుకుని కూర్చుంది. ఆమెనలా చూసి నాజియా మౌనంగా ఉండలేకపోయింది. వెంటనే  ఆమె సమీపంలోని పోలీసులకు విషయాన్ని తెలియజేసింది. వారు వచ్చి పెళ్లి ఆపారు. డింపీ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఒకేసారి రెండు సాహసాలు చేసిన నజియా గురించి పై అధికారులకు తెలియజేశారు. దాంతో సాహన బాలిక అవార్డు నాజియాను వెతుక్కుంటూ వచ్చింది.
 
కడలిని... దాటించాడు కడుపున జన్మించాడు! చెన్నై నగరం. వర్షం, వరద జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బైటికి కాలుపెట్టే పరిస్థితి లేక అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.   అలాంటి సమయంలో కెవ్వున కేక పెట్టింది చిత్ర. ఉలిక్కిపడ్డాడు మోహన్. నెలలు నిండిన కడుపును చేతపట్టుకుని నొప్పితో మెలికలు తిరుగుతోంది చిత్ర. మోహన్ గుండె గుభేల్‌మంది. తన భార్యను ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలి? తప్పదు. తీసుకెళ్లాలి. వెంటనే చిత్రను తీసుకుని బయటికి వచ్చాడు. కానీ గమ్యం చేరడం అసాధ్యమనిపిస్తోంది. తనకు, తన భార్యకు, ఇంకా భూమి మీద అయినా పడని తన బిడ్డకు అదే ఆఖరు రోజేమో అనిపిస్తోంది. అలా జరగనివ్వొద్దంటూ దేవుణ్ని మనసులోనే ప్రార్థిస్తున్నాడు. అతని ప్రార్థన దేవుడు విన్నాడో తెలీదో కానీ... దేవుడిలా ఒక వ్యక్తి మాత్రం వచ్చాడు. అతడే యూనస్. తన స్నేహితులతో కలిసి చిత్రను లైఫ్‌బోట్‌పైకి ఎక్కించాడు.  నానా తంటాలు పడి చిత్రను ఆస్పత్రికి చేర్చాడు. అతడు పడిన కష్టం వృథాగా పోలేదు. చిత్ర పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకున్న క్షణమే పేరు పెట్టేసింది. ఆ పేరు... యూనస్.
 
తెగించారు!  విధికి తలవంచారు
యువత తలచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అంటారు. అవును నిజమే. యువత తలచు కుంటే ఏమైనా చేయగలదు. ఎదుటివాళ్లను కాపాడటం కోసం తమ ప్రాణాలను సైతం ఇవ్వగలదు. ఆ రోజు నిర్జీవంగా పడివున్న డానిష్, నోమన్‌లను చూసి అందరూ ఈ మాటే అన్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కాల్వకు దగ్గరలో నడుస్తున్నారు డానిష్, నోమన్. అంతలో ఉన్నట్టుండి ఎవరివో అరుపులు వినిపించాయి. మాటలు ఆపి అటువైపు చూశారు. సుమన్ అనే మహిళ. పొరపాటున కాల్వలో పడిపోయినట్టుంది. పైకి రాలేక, ప్రవాహానికి ఎదురీదలేక అవస్థ పడుతోంది. మెల్లమెల్లగా మునిగిపోతోంది. అది చూసి తక్షణం స్పందించారు ఈ మొరాదాబాద్ (యు.పి.) యువకులిద్దరూ. ఎలాగైనా ఆమెను కాపాడాలని ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టం... ఆమెను కాపాడలేకపోయారు. పైగా ఆ ప్రయత్నంలో... తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. వారి త్యాగం అందరినీ కంటతడి పెట్టించింది. వారి అంత్యక్రియలకు ఆ ఊరి ప్రజానీకం తరలివచ్చింది. మతఘర్షణలకు పేరు మోసిన ఆ ప్రాంతంలో... ఆ ముస్లిం యువకుల అంతిమ యాత్రకు హిందువులు పెద్ద సంఖ్యలో హాజరై అశ్రుతర్పణ ఇవ్వడం విశేషం.
 
నాకెందుకులే అనుకోలేదు ‘నేనున్నాను’ అని వచ్చాడు
 అది ముంబై, లోఖండేమార్గ్‌లోని ఓ కిరాణా షాపు. యజమాని రజనీష్ ఠాకూర్ (36) తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. అంతలో ఓ వ్యక్తి షాపులోకి వచ్చాడు. కస్టమర్ అనుకుని ఏం కావాలి అని అడగబోయాడు రజనీష్. కానీ అతడు అడిగే అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారిగా రజనీష్ మీద దాడి చేశాడు. చేతిలో ఉన్న కత్తితో కసకసా పొడిచేశాడు. అసలే ఠాకూర్ వికలాంగుడు. దాంతో ఎటూ తప్పించుకోలేక, ప్రాణాలను రక్షించుకునే మార్గంలేక భయంతో మాన్పడిపోయాడు. కాసేపుంటే ప్రాణాలు వదిలేసేవాడే. కానీ అప్పుడే అక్కడికి ఫోన్ రీచార్జ్ చేయించు కోడానికి వచ్చాడు నసీరుద్దీన్ మన్సూరి (65). జరుగుతున్నదాన్ని చూసి నివ్వెరపోయాడు. అయితే భయపడి పారిపోలేదు. మనకెందుకులే అని వెళ్లిపోనూ లేదు. శక్తినంతా కూడదీసుకున్నాడు. నిందితుడికి ఎదురు తిరిగాడు. ప్రాణాలొడ్డి పోరాడి వాణ్ని తరిమేశాడు. రజనీష్‌ని తక్షణం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రక్తం బాగా పోవడంతో ప్రాణాపాయ స్థితిలో పడ్డ రజనీష్‌కి తన రక్తం ఇచ్చాడు. అతడి ప్రాణాలు కాపాడాడు. ఆ కుటుంబం వీధిపాలు కాకుండా నిలిపాడు మన్సూరి.
 
 
స్నేహం అనుకోలేదు...
 బంధం అనుకున్నాడు
‘‘ఏంటీ... సంతోష్ చనిపోయాడా?’’... స్నేహితుడి మరణవార్త వింటూనే విస్తుపోయాడు రజాక్. సంతోష్ తన ప్రాణ స్నేహితుడు. అతడు పోవడమంటే తనలో సగం మరణించినట్టే. అంతటి గాఢ స్నేహం వాళ్లది. అందుకే రజాక్ కళ్లు నీటి చెలమలయ్యాయి. సంతోష్ మరణం ఊహించనిదేమీ కాదు. చాలాకాలంగా ఏదో అంతు చిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకు. ఇక చికిత్స ఏం చేయించుకుంటాడు? అందుకే వ్యాధిని, అది పెట్టే బాధని సహించడం అలవాటు చేసుకున్నాడు. కానీ రజాక్ మాత్రం స్నేహితుడి స్థితి చూడలేకపోయాడు. తనకు ఉన్నంతలో ట్రీట్‌మెంట్ ఇప్పించాడు. ఎలాగైనా స్నేహితుణ్ని కాపాడుకోవాలని తపించాడు. కానీ అతని ఆశ నిరాశే అయ్యింది. మృత్యువు అతని మిత్రుణ్ని లాక్కెళ్లిపోయింది. విషయం తెలియగానే పరుగు పరుగున వెళ్లాడు రజాక్. మంచమ్మీద విగత జీవిగా పడివున్నాడు సంతోష్. ఆ మంచం పక్కనే దిగులుగా కూర్చుని ఉంది అతడి భార్య. ఆమె కళ్లలో వేదనతో పాటు అంత్యక్రియలు కూడా చేయలేని నిస్సహాయత కనిపించింది. అయినవాళ్లు ఇంకెవరూ లేకపోవడంతో ఆ భారం కూడా తనపైనే వేసుకున్నాడు రజాక్. అతడి నిర్ణయం విని కొందరి నొసలు పైకి లేచాయి. ఓ ముస్లిం, హిందువుకి అంత్యక్రియలు ఎలా చేస్తాడు? ఆ ప్రశ్న అన్ని పక్కల నుంచీ వినిపించినా విననట్టే కదిలాడు రజాక్. క్షణాల్లో పంచె కట్టాడు. కుండ చేతపట్టాడు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్య క్రియలను పూర్తి చేశాడు. నిజమైన స్నేహితుడిగా నిలిచిపోయాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన ఇది.
 

No comments:

Post a Comment