Wednesday, February 17, 2016

వన దేవతల కరుణ కోసం.. తరలిన జనం

వరంగల్‌ జిల్లా కేంద్రానికి నూటపది కిలోమీటర్ల దూరంలో ఉంది మేడారం. తాడ్వాయి మండల పరిధిలోకి వస్తుందా ప్రాంతం. వరంగల్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా సుమారు తొంభై కిలోమీటర్లు ప్రయాణిస్తే తాడ్వాయి చేరుకోవచ్చు. అక్కడి నుంచి మరో పద్నాలుగు కిలోమీటర్లు వెళ్తే మేడారం. అక్కడే వనదేవతలు సమ్మక్క సారలమ్మలు కొలువుదీరారు. మేడారానికి చుట్టూ ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాలున్నాయి. పొరుగున చత్తీస్‌గఢ్‌ ఉంది. రెండు దశాబ్దాల క్రితమే సర్కారువారు, మేడారం జాతరని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించారు. ఈ సారి, సంబురానికో ప్రత్యేకత ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత...సమ్మక్క-సారలమ్మ జాతర జరగడం ఇదే తొలిసారి. కేసీఆర్‌ ప్రభుత్వం...భారీస్థాయిలో రూ.174 కోట్ల నిధులు కేటాయించింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గిరిజన సంప్రదాయం ప్రకారం...ప్రతి రెండేళ్లకోసారీ నాలుగు రోజుల పాటూ నిర్వహించే ఈ మహా జాతర ఫిబ్రవరి 17, 18, 19, 20 తేదీల్లో జరుగనుంది. పదిహేడో తేదీన సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దె మీదికి ఎక్కుతారు. పద్దెనిమిదిన సారలమ్మ గద్దె ఎక్కుతుంది. పందొమ్మిదిన, భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఇరవైన అధికారిక లాంఛనాలతో అమ్మలు వనప్రవేశం చేస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాలనుంచి వచ్చే లక్షలాది భక్తులతో మేడారం జనసంద్రంలా మారుతుంది. చెంచులూ వడ్డెలూ గోండులూ కోయలూ లంబాడీలూ భిల్లులూ రఫీస్తార్‌ గోండులూ సవర ఆదివాసులూ...ఇలా సమస్త గిరిజనమూ తరలివస్తుంది.



జాతరకు వచ్చే భక్తులు, తొలుత పొలిమేరలోని జంపన్నవాగులో స్నానం చేస్తారు. ఆతర్వాతే సమ్మక్క-సారలమ్మల దర్శనానికి బయల్దేరతారు. వాగు ఒడ్డునే జంపన్న గద్దె ఉంది. జాతర సమయంలో వాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకూ సుమారు కిలోమీటరున్నర మేర కాలినడకనే వెళ్లాలి. అంత రద్దీగా ఉంటుందా ప్రాంతం. ప్రభుత్వం జంపన్నవాగుకు ఇరువైపులా స్నానఘట్టాలు నిర్మించింది. జల్లు స్నానాలకూ ఏర్పాటు చేసింది. సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుంచి గద్దెకు తీసుకువస్తున్నప్పుడు...జిల్లా కలెక్టర్‌, ఎస్పీ అక్కడే ఉంటారు. తల్లి సమ్మక్క గద్దె మీదికి వస్తున్నప్పుడు...జిల్లా పోలీసు ఉన్నతాధికారి గౌరవసూచకంగా గాలిలో కాల్పులు జరుపుతారు. మేడారం పరిసరాల్లో...నాలుగు కిలోమీటర్ల మేర బస చేసిన భక్తులకు అదే సంకేతం - అమ్మ గద్దె ఎక్కుతున్నట్టు. వెనువెంటనే జయజయధ్వానాలు మిన్నంటుతాయి.


గిరిజన సంప్రదాయంలో విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. వెదురు కర్ర, కుంకుమ భరిణె తదితర ప్రతీకలే ఉత్సవమూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే ఈనాటి గద్దె! మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపెల్లి నుంచి గిరిజనులు మేళతాళాలతో, డోలీ చప్పుళ్లతో సారలమ్మను తీసుకుని వూరేగింపుగా బయల్దేరతారు. సారలమ్మకు మొత్తం ఆరుగురు పూజారులు. పూజారుల సహాయకుడు -వడ్డె. ఇతనే సారలమ్మను గద్దెపైకి తెస్తాడు. సారలమ్మను బయటికి తెస్తున్నప్పుడు వందలాది భక్తులు కోర్కెలు తీర్చాలంటూ సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్టు బొక్కబోర్లా పడుకుంటారు. పూజారులూ వడ్డే ఆ జనాన్ని తొక్కుకుంటూ సారలమ్మను తీసుకొస్తారు. ఆలయ ప్రాంగణంలో మేకను బలివ్వడం సంప్రదాయం. అది కూడా మేక జడ్తీతోనే, బలికి అంగీకరిస్తున్నట్టు ‘మేమే...’ అంటూ తలూపితేనే! కన్నెపెల్లిలో ప్రారంభమైన వూరేగింపు సుమారు ఆరు గంటల తర్వాత మేడారానికి చేరుకుంటుంది. జాతరకు రెండ్రోజుల ముందే కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని పూజారి బృందం పగిడిద్దరాజుతో బయల్దేరుతుంది. దాదాపు తొంభై కిలోమీటర్లు నడిచి జాతర నాటికి మేడారానికి వచ్చేస్తుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజూ ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజులు ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉంటాడు. జాతరరోజు ఉదయమే గ్రామస్థులంతా గోవిందరాజును తీసుకుని వూరేగింపుగా మేడారానికి బయల్దేరతారు. అలా ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు. మరుసటిరోజు...సమ్మక్కతల్లిని చిలకలగుట్ట పైనుంచి తీసుకొచ్చి, భక్తుల జయజయధ్వానాల మధ్య గద్దెపై కూర్చోబెడతారు. ‘సమ్మక్క కో....సారలమ్మ కో’...నినాదాలు సముద్ర ఘోషను తలపిస్తాయి. నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా జరిగే జాతర... దేవతల వనప్రవేశంతో పరిపూర్ణం అవుతుంది. కళ్లనిండా ఆ అమ్మల రూపాల్ని నింపుకుని భక్తజనం తిరుగు ప్రయాణం అవుతారు.

అమ్మలకు...బంగారం
‘అమ్మలూ ఆదిశక్తి స్వరూపాలూ...కష్టాల నుంచి గట్టెక్కించండి...నిలువెత్తు బంగారాన్ని ఇచ్చుకుంటాం...’ అంటూ భక్తులు సమ్మక్క-సారలమ్మలకు బంగారం సమర్పించుకుంటారు. బంగారమంటే రుచీపచీలేని లోహపు ముద్ద కాదు. కమ్మకమ్మని ఎర్ర బంగారం...బెల్లం! భక్తితో నివేదించే బెల్లమే, ఆ తల్లికి బంగారం కంటే విలువైంది. ఓసారి, సంపన్నులంతా స్వర్ణాభరణాలు సమర్పిస్తుంటే, ఓ నిరుపేద చిన్నబోయి చూశాడట. ‘బతుకే బరువైన పేదవాడిని తల్లీ! అంతంత బంగారం ఎక్కడి నుంచి తీసుకురానూ, నీ అనుగ్రహాన్ని ఎలా సంపాదించనూ’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడట. బిడ్డ బాధపడితే, తల్లి మనసు తట్టుకుంటుందా? ఆ రాత్రి కలలో కనిపించి ..‘బెల్లమిస్తే బంగారం సమర్పించినట్టే బిడ్డా!’ అని ప్రేమగా సెలవిచ్చిందట. దీంతో ఆ పేదవాడు నిలువెత్తు బంగారాన్ని నివేదించి నిజభక్తిని చాటుకున్నాడట. అమ్మకు భక్తి ముఖ్యం. భక్తిలోని తీయదనానికి బెల్లం ప్రతీక!

సమ్మక్కకు ఒడి బియ్యం
మేడారం జాతరలో ఒడి బియ్యానికి ప్రత్యేకత ఉంది. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అప్పజెప్పేందుకు ఇంటి నుంచి బయలుదేరే మహిళలు కొత్త గుడ్డలో ఒడి బియ్యాన్ని పోసుకుని, నడుముకు కట్టుకుని వస్తారు. ఒడి బియ్యం సమ్మక్కకు అత్యంత ప్రీతిపాత్రమని భక్తుల విశ్వాసం. కొత్త బట్టలో సుమారు మూడు కిలోల బియ్యం, పసుపు, కుంకుమతో కలిపి...రెండు ఎండు కొబ్బరి కుడకలూ, రెండు రవిక ముక్కలూ, రెండు పోకవక్కలూ, ఖర్జూరాలూ వేసి నడుముకు కట్టుకుంటారు. సమ్మక్క, సారలమ్మలు గద్దెకు చేరిన తర్వాత వాటిని సమర్పిస్తారు.

మొక్కులు...
అమ్మవార్లకు ఎన్నో మొక్కులు. వేటపోతుల్నీ కోడి పుంజుల్నీ బలిస్తారు. కొబ్బరికాయలూ వస్త్రాలూ సమర్పిస్తారు. అమ్మలకు సమర్పించిన వస్త్రాల కోసం భక్తులు పోటీపడతారు. ఆ వస్త్రాలు ఇంట్లో ఉంటే కుటుంబానికి మేలు జరుగుతుందని నమ్మకం. మిగతా పుణ్యక్షేత్రాల్లానే తలనీలాలు సమర్పిస్తారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నట్టే, కోడెలు కట్టే సంప్రదాయమూ ఉందిక్కడ. చిలకలగుట్ట నుంచి సమ్మక్క మేడారంలోని గద్దెల మీదకు వచ్చే క్రమంలో ఎదురుకోడి పిల్లలు ఎగురవేస్తూ ఉంటారు. రూపాయి చెల్లించి సమ్మక్కకు ఎదురుగా కోడి పుంజును ఎగురవేస్తే అమ్మకు ఆరగింపు ఇచ్చినట్టే. మగవాళ్లు ఆడవేషం కట్టుకుని మొక్కులు చెల్లించుకుంటారు కూడా. ఆచారవంతుల వేషం వేసుకోవడం అంటే, సమ్మక్క-సారలమ్మల్ని ఆవాహన చేసుకోవడమే అన్న భావన. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించేవారూ, అన్నప్రాశనలు జరిపేవారూ ఎంతోమంది. ఇక్కడే పెళ్లిళ్లూ జరుగుతాయి. మేడారంలో శుభకార్యం పెట్టుకుంటే ముహూర్తాలతో పన్లేదు. ప్రతి రోజూ శుభదినమే. రాహుకాలాల ప్రస్తావనే లేదు. నవగ్రహాలూ ఆ తల్లుల కనుసన్నల్లోనే మెలుగుతాయంటారు.

హుండీలో గలగలలు!
మేడారం జాతరకు తరలివచ్చే ప్రవాసుల సంఖ్యా తక్కువేం కాదు. హుండీలో కనిపించే అమెరికా, సింగపూర్‌, యూకే, సౌదీ, దుబాయి, బహ్రేన్‌, రష్యా తదితర దేశాల కరెన్సీ కట్టలే అందుకు సాక్ష్యం. మొత్తంగా, మేడారం జాతర ఆదాయమూ క్రమంగా పెరుగుతోంది. 1968లో రూ.లక్షా 20 వేలతో ప్రారంభమైన రాబడి...2012 నాటికి రూ.5,91,41,875కు చేరుకుంది. 2014లో అయితే అక్షరాలా ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు! ఈ ఏడాది పదికోట్ల రూపాయల్ని అవలీలగా దాటిపోవచ్చని అంచనా. డబ్బే కాదు...వెండితో చేసిన అమ్మవారి వూయలలూ, విగ్రహాలూ, ముక్కుపుడకలూ హుండీలో వేస్తారు. రెండేళ్ల క్రితం కెనడా నుంచి ఎమెలీ అనే యువతి జాతరకు వచ్చింది. ప్రవాస తెలంగాణ ప్రజలు కథలు కథలుగా చెబితే...కళ్లారా చూద్దామని బయల్దేరిందట.
నాటి కుగ్రామం...
ఒకప్పుడు, మహా అయితే ఓ పాతిక గుడిసెల కుగ్రామం మేడారం. పట్టపగలే పులులూ సింహాలూ ఏనుగులూ సంచరించేవట. గద్దెలచుట్టూ ప్రదక్షిణలు చేసేవట. గర్జనలతో ఘీంకారాలతో వనదేవతల్ని కీర్తించేవట. మేడారానికి ప్రయాణమంటే...కాలినడకనో, ఎడ్లబండి మీదో రావాల్సిందే. అందులోనూ అడుగడుగునా గండాలే. ‘సమ్మక్క రక్ష..సారలమ్మ ఆన’ అనుకోగానే ఎక్కడలేని ధైర్యం. నిర్విఘ్నంగా భక్తులు మేడారానికి చేరుకునేవారు. కానీ ఇప్పుడు, జాతర సమయంలో మేడారం మహానగరాన్ని తలపిస్తుంది. విశాలమైన రోడ్లు వచ్చేశాయి. విద్యుద్దీపకాంతులూ వాహనాల రొదలూ ప్రముఖుల కాన్వాయ్‌ కూతలూ...ఆ నాల్రోజులూ జిల్లా పాలన...ఇక్కడి నుంచే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. గగనతలంలో హెలీకాఫ్టర్లూ సంచరిస్తుంటాయి. కోయదొరల జోస్యాలూ, సర్వరోగాలకూ చెట్లమందులూ, కొత్త బెల్లం వాసనలూ, శివసత్తుల పూనకాలూ, ఎడ్లబండ్ల పరుగులూ...ఆ హడావిడి చూడాల్సిందే.

దారివెంట...దర్శనీయాలు
మేడారం యాత్రలో దారి పొడవునా దర్శనీయ స్థలాలున్నాయి. ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, మంగపేట మండలాల్లోని అనేక ప్రాంతాలు పర్యటకుల్ని ఆకట్టుకుంటాయి. సమ్మక్క-సారలమ్మల దర్శనం చేసుకున్నాక, తిరుగు ప్రయాణంలో వరంగల్‌వైపు నుంచి వచ్చేవారు ఎన్నో పర్యటక ప్రాంతాల్ని సందర్శించవచ్చు.

* తాడ్వాయి-వరంగల్‌ మార్గంలో చల్వాయి గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో లక్నవరం సరస్సు ఉంది. దీనిపై ఏర్పాటు చేసిన...వేలాడే వంతెన పర్యటకులకు ప్రత్యేక ఆకర్షణ. దట్టమైన అటవీప్రాంతంలో అందమైన కాటేజీలూ రెస్టారెంట్లూ ఉన్నాయి. హుషారుగా బోటు షికార్లూ చేసుకోవచ్చు.

* తాడ్వాయి-వరంగల్‌ మార్గంలో ములుగు కంటే కాస్త ముందే, జంగాలపల్లి క్రాసింగ్‌ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం...ఎడమ వైపు వెళితే రామప్పగుడి కనిపిస్తుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధ ఆలయం. అక్కడి నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో గణపురం మండలంలో కాకతీయుల కాలం నాటి ‘కోటగుళ్లు’ ఆలయ సముదాయం ఉంది. ఇక్కడి నుంచి నేరుగా పరకాల రోడ్డుకు చేరుకుని, వరంగల్‌ వెళ్లిపోవచ్చు.

* వరంగల్‌లో ప్రసిద్ధ వేయిస్తంభాల గుడి, కాకతీయుల రాజధాని ప్రాంతమైన ఖిలా వరంగల్‌, భద్రకాళి ఆలయం చూడదగినవి.

* మంగపేట ప్రాంతం నుంచి వచ్చే వారు...మల్లూరులోని హేమాచల లక్ష్మీనరసింహస్వామిని కళ్లారా దర్శించుకోవచ్చు.

* చత్తీస్‌గఢ్‌తో పాటు ఖమ్మం జిల్లా వెంకటాపురం, పేరూరు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు... ముల్లకట్ట వద్ద గోదావరి నదిపై నిర్మించిన సుమారు రెండు కిలోమీటర్ల భారీ వంతెన కూడా పర్యటక ప్రదేశమే.

No comments:

Post a Comment