రైతు కంట కన్నీరు తెలుగు నాట రైతులకు కష్టాలు తలుపు తట్టి లోపలకు వచ్చాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతున్నాయి. కష్టాల ఊబిలోకి కూరుకొని పోవటమే కాని బయటకు వచ్చే మార్గం కాన రావటం లేదు.
రుణమాఫీచేసిన గాయం..
అధికారంలోకి రావటానికి ముందు నుంచీ చంద్రబాబు ప్రచారం ఊదరగొట్టారు. బ్యాంకులకు అప్పులు కట్టాల్సిన పని లేదని, తాము అదికారంలోకి రాగానే అప్పులన్నీ మాఫీ చేసేస్తానని నమ్మబలికారు. నమ్మి ఓట్లేసినందుకు చంద్రబాబు తన తడాఖా చూపించారు. పదవిలోకి వచ్చాక కూడా రుణమాఫీ జరిగిపోతోందని ప్రచారం కొనసాగించారు. దీంతో రైతులు అప్పు కట్టకుండా నిరీక్షించారు. వాస్తవానికి వ్యవసాయ రుణాల విషయంలో మొదటి సీజన్ పూర్తయ్యే దాకా బ్యాంకులు నామ మాత్రపు వడ్డీతో నిరీక్షిస్తాయి. కానీ, సీజన్ దాటిపోతే మాత్రం మొదట రోజు నుంచి చక్రవడ్డీ విధిస్తాయి. చంద్రబాబు ని నమ్మిన రైతులందరికీ వడ్డీల మీద వడ్డీ , అంటే చక్రవడ్డీలు పడిపోయాయి. దీంతో బ్యాంకుల్లో రుణాలు తడిసిమోపెడు అయ్యాయి.
పెట్టుబడి కరవు
2,3 సీజన్ లు దాటాక రైతులకు పెట్టుబడి దొరికే దారి లేకుండా పోయింది. బ్యాంకులు పాత బాకీలు తీరిస్తే తప్ప గుమ్మం తొక్కద్దని చెప్పేశాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఇదే అదనుగా వడ్డీ రేటు పెంచేశారు. దీంతో మరో మార్గం లేక 5,6 రూపాయిల వడ్డీకి అప్పులు తెచ్చుకొన్నారు. అటు బ్యాంకుల అప్పు, ఇటు ప్రైవేటు అప్పు అన్నీ కలిసి రైతుల్ని అప్పుల కుప్పంలోకి లాగేస్తున్నాయి. చిన్న రైతులు, కౌలు రైతులకు మాత్రం ఈ అప్పులు కూడా దొరక్క అల్లాడిపోతున్నారు.
విత్తన సమస్య
ప్రతీ ఏటా వ్యవసాయ శాఖ సీజన్ కు ముందుగానే సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. వచ్చే సీజన్ లో ఎంత మేర సాగు జరుగుతుంది, ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల అవసరాలు వంటివి మదింపు చేస్తుంది. వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు పూర్తిగా రాజధాని పనుల్లో బిజీగా మారిపోవటంతో సన్నాహాక భేటీలు కొండెక్కేశాయి. దీంతో సీజన్ కు సరిపడ విత్తనాలు, ఎరువులు వంటివి కరవయ్యాయి. దీంతో నాసిరకం విత్తనాలతో సేద్యానికి రైతులు ఒడిగట్టాల్సి వచ్చింది. దీంతో ప్రక్రతి కాస్తంత కోపించినా పంట మొత్తం నష్టపోవాల్సి వస్తోంది.
సాగునీటి కష్టాలు
వ్యవసాయానికి సాగునీరు గుండె కాయ వంటిది. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే పొలాలకు సక్రమంగా తడి అందుతుంది. కానీ చంద్రబాబు పంతం పట్టి మరీ , ఈ వ్యవస్థను నిర్లక్ష్యం చేసేస్తున్నారు. సగానికి సగం సిబ్బంది కొరత ఉండటంతో అదునుకు తగినట్లుగా నీటిని విడుదల చేయటం లేదు. క్షేత్ర స్థాయిలో పనిచేసే లష్కర్ వంటి పోస్టులు వదిలేయటంతో నీటిని వదిలే పరిస్తితి కనిపించటం లేదు. దీంతో పొలాలకు నీరు అందటం లేదు. అటు ప్రధాన ప్రాజెక్టులన్నీ నత్త నడక నడుస్తున్నాయి. చెరువులు, కాల్వల్లో పూడిక తీసే నాధుడులేడు. దీంతో అడప తడపా నీటి తడులతోనే కాలం వెళ్లబుచ్చాల్సి వస్తోంది.
బాబుతో తరలి వచ్చిన కరవు
చంద్రబాబు కరవు కవల పిల్లలు అని చెబుతారు. ఏడాది కాలంగా కరవు పరిస్తితి కరాళ నాట్యం చేస్తోంద. 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కంటికి చుక్క నీరుకనిపించక రైతుల కళ్లల్లో నీ రు తిరుగుతోంది. అయినప్పటికీ కరవు మండలాల ప్రకటనలో చంద్రబాబు తన బుద్ది బయట పెట్టుకొన్నారు. సగానికి సగం మండలాల్ని తగ్గించేసి మమ అనిపించేశారు. స్వయంగా వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ 350 మండలాలు కరవు మండలాలు ఉన్నాయని ప్రకటిస్తే, దాన్ని పట్టించుకోకుండా 200 లోపే కరవు మండలాల్ని ప్రకటించారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రయోజనాల్ని ఎగ్గొట్టేందుకు బాబు పన్నిన కుట్ర ఇది.
గిట్టుబాటు ధర విషయంలో పూర్తి స్తాయి మోసం
ఇన్ని కష్టాలు పడి వ్యవసాయం చేస్తే రైతులకు చివరకు మిగిలేది శూన్యమే. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం నాటకాలు ఆడుతోంది. మద్య దళారీలు, వ్యాపారుల ప్రయోజనాలు కాపాడేలా నిర్ణయాలు అమలు అవుతున్నాయి. ఎంత మొత్తుకొన్నా వరికి రూ. 50కి మించి మద్దతు ధర పెంచలేదంటే అర్థం చేసుకోవచ్చు. అయిన కాడికి అమ్ముకొని రైతులు బయట పడుతున్నారు. చివరకు రైతు పరిస్థితి అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి మాదిరిగా తయారైంది.
అనుబంధ పరిశ్రమలదీ అదే తీరు
వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమలు దిగాలు చెందాయి. కరెంటు కోతలు, అంటు వ్యాధులతో పౌల్ట్రీ ఫామ్స్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. రేటు విషయంలో దళారీలు ఆడిందే ఆట గా సాగుతోంది. పాడి పరిశ్రమ బాగా క్షీణించింది. రాష్ట్రమంతా కరవు వ్యాపించటంతో పచ్చ గడ్డి నిల్వలు అడుగంటిపోయాయి. మనుషులు తాగటానికే నీళ్లు లేకపోవటంతో పశువులకు నీరు అందించే దిక్కు లేదు.
No comments:
Post a Comment