Monday, September 26, 2016

పీఎస్ఎల్ వీ-సీ35 విజయవంతం


శ్రీహరికోట(సూళ్లూరుపేట): వరుస అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళుతూ విజయం సాధిస్తోన్న భారత్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలిసారిగా బహుళ కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. బహుళ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ35 విజయవంతంగా ఆ పనిని పూర్తి చేసింది. ఈ విజయంపట్ల భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు అమితానందం వ్యక్తం చేశారు. శ్రీహరికోటలోని సతీశ్‌ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ35 నింగిలోకి దూసుకెళ్లింది. తొలుత స్కాట్ శాట్ -1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఈ నౌక మొత్తం 2గంటల 15 నిమిషాల్లో మరో ఏడింటిని వాటి కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. నాలుగు దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది.

ఈ ఉపగ్రహాల్లో భారత్‌కు చెందిన వాతావరణ ఉపగ్రహం స్కాట్‌శాట్-1తో పాటు అమెరికా, కెనడా తదితర ఐదు విదేశీ ఉపగ్రహాలున్నాయి. వీటి మొత్తం బరువు 675 కిలోలు. 48.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ35 రాకెట్ ప్రయోగాన్నిఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశల్లో 32 నిమిషాల్లో పూర్తి చేశారు. మొత్తం ఉపగ్రహాలన్ని కూడా వాటి వాటి కక్ష్యలోకి చేరవేసే ప్రక్రియ 2.15గంటల్లో పూర్తయింది. ఇప్పటి వరకు ఇస్రో చరిత్రలో అత్యంత సుదీర్ఘ ఉపగ్రహ ప్రయోగం ఇదే.

సునామీలను, తుపానులను గుర్తించడం, గాలి ఉధృతిని గమనించడంవంటి కీలక వాతావరణ సమాచారాన్ని స్కాట్‌శాట్-1 ద్వారా పొందవచ్చు. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ప్రయోగించిన 17 నిమిషాలకు స్కాట్‌శాట్-1ను భూమికి 730 కి.మీ.ల ఎత్తులోనిసూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆతర్వాత నౌకను కిందకు రప్పించి 689 కి.మీ.ల ఎత్తులోని కక్ష్యలోకి 7 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్ర వేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు.

No comments:

Post a Comment