Tuesday, February 9, 2016

రామరామ శివశివ

పేరు రామన్న... వేషం శివన్న... వృత్తి మోసమన్నా...
‘బీస్ సాల్ బాద్’ అంటే... ఇరవై ఏళ్ల తరువాత
యూత్ ఈ చీటింగ్‌కి చెక్ పెట్టింది.
లేకపోతే ఇంకో తరాన్ని మింగేవాడు.
ఎక్కడో ఊర్లళ్లో జరుగుతుందని దీనికి మనకు సంబంధం లేదని... ఓ ఫీలైపోకండి. ఎప్పుడో ఇలాంటోడు మన గడపా తొక్కొచ్చు.
మోసాలు మారలేదు... మోసగాళ్ల తీరులే మారాయి.
బీ కేర్‌ఫుల్ లేకపోతే రామరామ... శివశివ..
.
 
అనంతపురం జిల్లా, ధర్మవరం మండలంలో నేలకోట గ్రామం. ఓ ఇంటి ముందు నిలబడి ఉన్నాడు రామన్న. ‘మీ ఇంట్లో ఒక జీవి పడుకుని ఉన్నాడు. వారం రోజులైనా వ్యాధి తగ్గడం లేదు. ఎందుకు తగ్గలేదోననే ఆలోచన ఇంట్లో ఒక్కరికీ రాదు. నేనొచ్చి చెప్పకపోతే మరో వారానికి మంచం మీదున్న ఆ జీవిని మంచం దించాల్సి వచ్చేది’ అంటూ పద్యం చదివినట్లు చదువుతున్నాడు. ఇంటి లోపలి నుంచి ఓ మధ్య వయస్కురాలు ఆందోళనగాబయటకు వచ్చింది. ‘నిజమే రామన్నా! పిల్లాడు జ్వరాన పడ్డాడు. వారం నుండి లేవట్లేదు. మందులేస్తున్నాం. జ్వరం తగ్గుతోంది, మళ్లీ వస్తోంది’ అన్నది గాబరాగా. ‘రాత్రి నేను దీవెన పాడుతూ చూశాను. గ్రామంలో పిశాచి తిరుగుతోంది. దాని నీడ మీ ఇంటి మీద పడింది. ఇటుగా వెళ్లి ఆ ఇళ్ల మీద నుంచి దక్షిణంగా వెళ్లిపోయింది. దానిని పట్టుకుని ముగ్గులోకి దించి నల్లపోతును కట్టుపెట్టాలి (బలివ్వడం). అప్పుడే నీ కొడుకు ప్రాణం దక్కుతుంది. ప్రాణానికి ప్రాణమే అడ్డు’ అని ఆమె ముఖంలోకి, ఇంటి వెనుక కట్టేసి ఉన్న మేకపోతును మార్చి మార్చి చూస్తున్నాడు. తల్లి ప్రేమ మరేమీ ఆలోచించలేదు. అన్నట్లుగానే రామన్న నల్లపోతును బలిచ్చాడు. భుజాన ఉన్న జోలె నుంచి పుర్రె, అస్తికలను బయటకు తీశాడు. ఏవేవో పూజలు చేశాడు. ఆ తర్వాత పేగులను మెడలో వేసుకుని ఊరంతా తిరిగాడు.

తెల్లకాళ్ల రామన్న వచ్చాడబ్బా...
నేలకోటలో ఇదో చర్చకు దారి తీసింది. వాళ్లకు అదేమీ కొత్తకాదు కానీ ప్రతిసారీ ఒక ఉదంతం ఆసక్తికరంగా మారుతుంటుంది. రామన్న సంచారజీవి. కుటుంబంతోపాటు సంచరిస్తుంటాడు. ధర్మవరం చుట్టుపక్కల పాతికకు పైగా పల్లెలకు సుపరిచితుడు. పట్టణాల జోలికి వెళ్లడు. కొండల మధ్య నివాసప్రదేశాలనే టార్గెట్ చేసుకుంటాడు. ఒక ఊరికి వచ్చి ఖాళీ జాగా చూసుకుని గుడారం వేస్తాడు. మూడు రోజుల పాటు రోజూ అర్ధరాత్రి ఒంటిగంట నుంచి తెల్లవారు జామున ఐదింటి వరకు ఊరంతా తిరుగుతూ గ్రామానికి దీవెనలిస్తున్నట్లు రాగయుక్తంగా పద్యాలు చదువుతుంటాడు. పగలు చాలా మామూలుగా తిరిగేవాడు. ఎవరినీ యాచించడు. మూడు రోజుల రెక్కీలో గ్రామంలో ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉందనేది గమనిస్తాడు. ఎవరింట్లో అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, కుటుంబ తగాదాల వంటివన్నీ గ్రహిస్తాడు. ఏ ఇంటికి పొలం ఉంది... ధాన్యం బస్తాలివ్వగలిగిందెవరు, మేకలు, గొర్రెలు ఎవరికున్నాయి, కోళ్లతో సరిపెట్టుకోవాల్సిన ఇళ్లేవి... అనేది కూడా పట్టేస్తాడు. ఇక నాలుగవ రోజు పగటి పూట ఏదో ఓ ఇంటి ముందు ఇలా నిలబడిపోతాడు. రామన్న ఊళ్లోకి వచ్చిన రాత్రి నుంచే ‘రామన్న వచ్చినట్లుండబ్బా’ అని ఒకరికొకరు చెప్పుకునేటంతటి ఎరిక రామన్నంటే. ఇక వారం పది రోజులపాటు రామన్న బలిచ్చిన పోతులు, తోలుకెళ్లిన పోతులు కూడా చర్చలో భాగమవుతుంటాయి. రాత్రిళ్లు ఉన్నట్లుండి పెద్దగా అరుస్తూ పడిపోతాడు. తెల్లవారి ఎవరైనా అడిగితే ‘నాలుగు దెయ్యాలు వచ్చి నా గుండెల మీద కూర్చున్నాయి. రావుల చెరువు తండా, మదిరే బయిలు,నార్సింపల్ల్లిలో నేను పారదోలిన దెయ్యాలే అవన్నీ. నా ఆచూకీ వెతుక్కుంటూ ఈ ఊరికి వచ్చాయి’ అంటూ రచ్చబండ దగ్గర కబుర్లు చెబుతూ తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో దిట్ట రామన్న.

మందు కక్కిస్తాడు...
పిశాచాలను పారదోలడంతోపాటు దీర్ఘకాల అనారోగ్యంతో కృశించి పోతున్న వాళ్ల చేత మందు కక్కించడం రామన్నకు ఉన్న మరో అదనపు ఆకర్షణ. ‘మా అబ్బాయికి బాగాలేదనీ, అమ్మాయి నీరసించి పోతోంద’ని వచ్చిన వాళ్లను పరీక్షించి ‘ఎవరో మందు పెట్టారు, ఆ మందుని కక్కిస్తాను’ అని రంగంలో దిగుతాడు. నీటిని తాగించి తాగించి తమలపాకుతో నాలుక గీకగానే వాంతవుతుంది. అందులో కాల్చిన మాంసం ముద్ద, వెంట్రుకలు బయట పడుతుంటాయి. మరికొందరికి మందు తలలోకి ఎక్కించారని చెబుతాడు. తలకు కణిక రాయితో గాటు పెట్టి నోటితో పీలుస్తాడు. పసుపు పచ్చని ద్రవాన్ని బయటకు ఉమ్ముతాడు.
 
నేను గాని నోరు విప్పానా!
చీడపీడలను పోగొడతానంటూ మంత్రాలు చదివి నీటిలో చిటికెడు పొడి కలిపి ఇచ్చేవాడు. ఆ నీరు తియ్యగా ఉంటే వాళ్ల పీడ విరగడైనట్లు అన్నమాట. ఇక అతడు అడిగినవన్నీ సమర్పించుకోవాలి. నీరు చేదుగా ఉంటే పీడ ఇంకా విరుగుడు కాలేదు. దెయ్యం ఇంటి మీద నడుస్తోంది. నీరు తియ్యగా వచ్చే వరకు రోజూ పూజలు చేయాలి... ఇదీ వరస. ఎవరైనా రామన్న వలలో చిక్కకపోతే బెదిరింపులకు దిగుతాడు. ‘నేను మచ్చ నాలుక రామన్నని. నేనేది చెబితే అది జరుగుతుంది’ అని భయపెడతాడు. ఇంటి ముందు ఏ జీవాలున్నాయో చూసి... ‘ఇవి ఇచ్చే వరకు వెళ్లన’ని నిలబడిపోతాడు. మొండి వాడు ఏం చేస్తాడోననే భయంతో ఇచ్చేస్తారు. ఆ పరిసర గ్రామాలన్నింటిలోనూ రామన్న మీద భయంతో కూడిన గౌరవం అది.

రామన్న ఆటకట్టించాలనే ఉత్సాహం కలిగిన యువకులు ఒక బృందంగా కలిశారు. రామన్న బాధితుల్లో బాలాజీ నాయక్ ఒకరు. అతడి దగ్గర సారా తాగి డబ్బు ఎగ్గొట్టేవాడు రామన్న. అప్పు ఇవ్వనంటే శాపం పెట్టి భయపెట్టేవాడు. ఆ బాలాజీ నాయక్ కూడా యువజన బృందంతో కలవడంతో రామన్న ఆట కట్టించడం సాధ్యమైంది.        - వాకా మంజులారెడ్డి
 
తలలో మందు!
గాటు మీద నోటిని ఉంచి పీల్చినట్లు భ్రమింపచేస్తూ అప్పటికే నోట్లోకి తీసుకున్న నువ్వుల నూనెను పుక్కిలిస్తాడు. నువ్వుల నూనె లాలాజలంతో కలిసినప్పుడు పసుపురంగులోకి మారుతుంది. దాన్నే ఉమ్ముతాడు. తలలోని మందును తీసినట్లు నమ్మిస్తాడు.
 
కడుపులోకి మాంసం ఎలా వెళ్లింది?
మందును కక్కించే ప్రయత్నంలో దాదాపుగా ఐదు లీటర్ల నీటిని తాగిస్తాడు. అన్ని నీటిని తాగే క్రమంలో మనిషి బాగా అలసిపోతాడు. నీటిని గుక్క వేయాలంటే గరళాన్ని మింగినట్లు కష్టపడతారు. అప్పుడు నీటితోపాటు మాంసం ముద్దను మింగించేస్తారు. పేషెంటు మాంసాన్ని మింగుతున్న విషయం కూడా గ్రహించలేనంత నీరసించిపోయి ఉంటారు. ఆ తర్వాత తమలపాకుతో నాలుక మీద గీయగానే వాంతయిపోతుంది. మాంసం బయటకు వస్తుంది.
 
ఇలా  ఛేదించారు!
ఓ రోజు రామన్న తాగిన మత్తులో ఉన్నప్పుడు అతడి సంచిని బాలాజీ, హనుమంతరెడ్డి కొట్టేశారు. అందులో తెల్లడి పొడులు గుడ్డల్లో మూటగట్టి ఉన్నాయి. వాటిలో ఒకటి శాక్రిన్ పౌడర్, ఒకటి వేపగింజల పొడి. మళ్లీ ఏమీ తెలియనట్లు సంచిని సర్దేశాం. ఒకరోజు రచ్చ దగ్గర ఇదే ట్రిక్ చేస్తున్నప్పుడు వెళ్లి ‘నేను మంత్రించి ఇచ్చినా కూడా నీళ్లు తీపి అవుతాయి, చేదు కూడా అవుతాయి. చేసి చూపించమంటావా? నీ సంచిలో ఏమేమి ఉన్నాయో నువ్వే చూపిస్తావా, మేము తియ్యమా?’ అని నిలదీయడంతో దారికొచ్చాడు. ఈ సంగతి రామన్నను తెలిసిన ప్రతి ఊరికీ తెలిసిపోయింది. అప్పటి నుంచి తంత్రాలు మానేసి మేకలు మేపుకుంటూ బతకసాగాడు.

No comments:

Post a Comment