ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సినీ హీరో పవన్ కళ్యాణ్ భేటీ టీవీచానెళ్లకు మంచి బ్రేకింగ్ న్యూస్ అందించింది తప్ప ప్రజలకు ఏమీ ప్రయోజనం కలిగించ లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. పచ్చ మీడియాలో దీని మీద రక రకాలుగా కథనాలు వండి వార్చుకోవటానికి మాత్రం ఊతమిచ్చింది. అదే సమయంలో హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పొత్తులు, సమీకరణాలతో పాటు ఇచ్చిపుచ్చుకోవటాలు దిశగా భేటీ సాగిందనే మాట బలంగా వినిపిస్తోంది.
ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చంద్రబాబు తో కలిసి ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్.. ప్రజలకు ఎన్నెన్నో హామీలు గుప్పించారు. టీడీపీ, బీజేపీ పార్టీల కూటమి ఎన్నెన్నో వరాలు రప్పిస్తుందని నమ్మబలికారు. తర్వాత కాలంలో జనం సమస్యల మీద ప్రశ్నించటానికే జన సేన పార్టీ అని వివరణ ఇచ్చారు. అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించక పోవటం తప్పని బలంగా వాదించారు.సామాన్యుడి తరపున తాము నిలబడదామని పదే పదే చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు మాత్రం అందుకు తగినట్లుగా లేకపోవటం గమనార్హం. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ హడావుడిగా ఆ ప్రాంతంలో పర్యటించారు. భూ సేకరణ ఎంతైనా చేసుకోవచ్చు కానీ, భూ సమీకరణ చేయకూడదని చెప్పారు. అన్నంతనే భూ సమీకరణ నుంచి వెనక్కి తగ్గినట్లుగా చంద్రబాబు ప్రభుత్వం గిమ్మిక్కు చేసింది. అసలు భూ సమీకరణకు ఆస్కారమే లేదని అందరికీ తెలిసినా రైతుల తో మైండ్ గేమ్ ఆడుకొనేందుకు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఉపయోగపడ్డారన్న మాట అప్పట్లో బలంగా వినిపించింది.
ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించటం లేదని ఎంపీల గురించి పవన్ కళ్యాణ్ హేళనగా మాట్లాడారు. అప్పటికే ప్రత్యేక హోదా గురించి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఉద్యమిస్తోంది. ఢిల్లీ లో కేంద్ర పెద్దలకు అనేక సార్లు విన్నపాలు చేయటం, పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేయటం, రాష్ట్రంలో దీక్షలు చేయటం వంటి పోరాటాలు కొనసాగిస్తోంది. అయినప్పటికీ వాటి గురించి ప్రస్తావించకుండా ప్రత్యేక హోదా గురించి ఎంపీలు ప్రశ్నించటం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తర్వాత దీని గురించి ప్రశ్నించటం పవన్ మానుకొన్నారు.
అమరావతి శంకుస్థాపన కు మంత్రుల్నితన దగ్గరకు రప్పించుకొని ఆహ్వానం అందుకొన్న పవన్ కళ్యాణ్ అప్పుడు హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం శుభాకాంక్షలు తెలిపేందుకు విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసినట్లుగా చెప్పారు. గతంలో ప్రస్తావించిన రాజధాని కష్టాల గురించి కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కానీ ఏమాత్రం అడగలేదు. కానీ బాక్సైట్ తవ్వకాల విషయంలో చంద్రబాబు అంతా మంచే చేస్తారు, ప్రత్యేక హోదా లేక ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అంతా మంచే జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చారు. ప్రశ్నిస్తామని పదే పదే చెప్పిన పార్టీ చివరకు ప్రశ్నించకుండా చతికిల పడుతోందా అన్న మాట బలంగా వినిపిస్తోంది. చంద్రబాబు కి అనుబంధ సంస్థ గా జన సేన ను మార్చేస్తున్నారా అన్న వాదనకు దారి తీస్తోంది.
No comments:
Post a Comment